జిల్లాకు ‘నిర్భయ క్రైం సెంటర్’
సాక్షి, ఒంగోలు : జిల్లాకు అరుదైన అవకాశం లభించింది. మహిళలపై కొనసాగుతున్న లైంగిక వేధింపుల నియంత్రణకు కేంద్రం చేపట్టిన బృహత్తర ప్రణాళిక జిల్లాలో అమలుకానుంది. ‘నిర్భయ క్రైం సెంటర్’ పేరిట మహిళల రక్షణకు ప్రత్యేక పోలీసు రక్షణ ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో ఆ విషయాలు వెల్లడించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 50 నిర్భయ క్రైం సెంటర్లు ఏర్పాటు చేస్తోందని.. అందులో ఒకటి ప్రకాశం జిల్లాకు కేటాయించడం విశేషమన్నారు.
ఇప్పటికే కేంద్రహోం మంత్రి నిర్భయ క్రైం సెంటర్‌కు సంబంధించి తనతో మాట్లాడినట్లు తెలిపారు. సెంటర్ ఏర్పాటుకు తగిన స్థలం కూడా త్వరలోనే గుర్తించి కే టాయించాలని కేంద్రమంత్రి పంపిన లేఖను ఎంపీ ప్రస్తావించారు. ఈసెంటర్ జిల్లావ్యాప్తంగా మహిళలపై జరిగే అకృత్యాలపై స్పందించి.. నేరగాళ్ల భరతం పట్టేందుకు సహకరిస్తుందన్నారు. నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్‌ల వారీగా క్షేత్రస్థాయిలో నిఘాపెట్టి మహిళలకు రక్షణ, భద్రతా చర్యలపై కౌన్సెలింగ్ నిర్వహించడం, కళాశాలల విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణనివ్వడం తదితర అంశాలు క్రైంసెంటర్ పర్యవేక్షణలో కొనసాగుతాయన్నారు.
కలెక్టర్‌తో చర్చలు...
స్థానిక కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాత్రి కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్‌ను కలిసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం అనుమతించిన నిర్భయక్రైం సెంటర్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సినందున.. అందుకు తగిన స్థల ఏర్పాటుపై శరవేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తాను తక్షణమే నగరపాలకసంస్థ కమిషనర్‌తో మాట్లాడి స్థలాలపై వివరాలను తెప్పించుకుని..15 రోజుల్లోనే క్రైంసెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తానని హామీనిచ్చారు. అదేవిధంగా ఒంగోలుకు కార్పొరేషన్ హోదా వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు సిటీలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు లేకపోవడం ఇబ్బందికరమని ఎంపీ అన్నారు. దీనిపై కూడా ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్‌తో మాట్లాడి సిటీబస్సులు ఏర్పాటు చేస్తానని కలెక్టర్ చెప్పారు.