సృష్టిలోని ప్రతీ తల్లికి తన బిడ్డ అపురూపమే. ప్రాణాలు పణంగా పెట్టి జన్మనిచ్చిన తన పాపాయికి చిన్న ఆపద కలిగినా అమ్మ మనసు తట్టుకోలేదు. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో ఆ మాతృమూర్తి మనోభావాలు మరింత సున్నితంగా ఉంటాయి. కూతురు ఉన్నతోద్యోగం చేస్తూ.. పదిమందిని శాసించే స్థాయిలో ఉన్నా చంటి బిడ్డలాగే తనను లాలిస్తుంది. చిన్ననాడు తన చీర కట్టుకుని మురిసిపోయిన తన చిట్టితల్లి .. అత్తింటికి వెళ్లి... తనో బిడ్డకు తల్లిగా మారితే చూసి మురిసిపోవాలనుకుంటుంది. ఢిల్లీకి చెందిన ఆశాదేవి కూడా తన కూతురి విషయంలో సరిగ్గా ఇలాగే ఆలోచించారు. అయితే ఆమె ఆశలను చెల్లాచెదురు చేశారు ఆరుగురు మృగాళ్లు. ఆమె కూతురిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. తీవ్రంగా హింసించి ఈ లోకంలో లేకుండా చేశారు. ఆశాదేవికి గర్భశోకం మిగిల్చారు.
అవును... సామూహిక అత్యాచారానికి గురై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిన నిర్భయకు తల్లి ఆమె. రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానమ్మా బయటకు వెళ్లిన కూతురిపై ఏ మృగం దాడి చేసిందో తెలియనంతగా.. కూతురి శరీరం రక్తంతో తడిసిపోతే కళ్లారా చూసి గుండె పగిలేలా రోదించింది. పెదవులు చిట్లిపోయి... తలమీద చర్మం ఊడిపోయి... మాంసపు ముద్దలా ఆస్పత్రి మంచం మీద పడి ఉన్న బిడ్డకు ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురుచూసింది. తమ కెరీర్‌లో ఇంతటి ఘోరమైన కేసును ఎప్పుడూ చూడలేదని వైద్యులు వాపోయినా.. ఏదో ఒక అద్భుతం జరిగి తన చిన్నారి తల్లి కళ్లు తెరుస్తుందనుకుంది.(నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు)
కానీ నిర్భయ తన తల్లి కలలను కల్లలు చేస్తూ శాశ్వతంగా ఆమెకు దూరమైంది. చికిత్స పొందుతున్న క్రమంలో ఏనాడు కనీసం గుక్కెడు మంచి నీళ్లు కూడా తాగకుండానే ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయింది. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి కోలుకోవడం ఏ తల్లికైనా సాధ్యం కాదు. ఆశాదేవి కూడా ఇందుకు అతీతురాలు కాదు. కూతురిని తలుచుకుని అందరిలాగే కుంగిపోయింది. బిడ్డ జ్ఞాపకాలతో పిచ్చిపట్టినదానిలా అయిపోయింది. అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటే.. తన కూతురికి న్యాయం జరగదనే సత్యం ఆమెకు తొందరగానే బోధపడింది. అందుకే తనకు కడుపుకోత మిగిల్చిన వాళ్లకు సరైన శిక్ష పడేలా చేసేందుకు నడుం బిగించింది. ఓ తల్లిగా తాను సర్వం కోల్పోయినా.. మనసును బండరాయి చేసుకుంది. బాధను దిగమింగి తనలోని శక్తినంతటినీ కూడగట్టుకుని ఏడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోంది.( ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’: నిర్భయ దోషి భార్య)
ఈ క్రమంలో ఆశాదేవికి ఎదురైన చేదు అనుభవాలకు లెక్కేలేదు. ‘‘ఆడపిల్లను ఒంటరిగా ఎందుకు బయటకు పంపిస్తారు. అలా అబ్బాయిలతో స్నేహం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురుకాక ఇంకేమవుతుంది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇలాగే అవుతుంది’’అని సామాన్యుల నుంచి దోషుల లాయర్ వరకు ప్రతీ ఒక్కరు సూటిపోటి మాటలతో ఆమెను చిత్రవధ చేశారు. అయినా వాటన్నింటినీ ఆమె లెక్కచేయలేదు. తన కూతురి కోసం వీధుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన యువత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగింది. జిల్లా కోర్టు మొదలు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇలా న్యాయం కోసం ఆమె ఎక్కని కోర్టు మెట్టులేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మార్చి 13, 2014లో అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లభించిన మీదట నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే వాళ్లు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిగువకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు.(ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి : దోషుల లాయర్)
ఈ నేపథ్యంలో 2017 మే 5న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆశాదేవి మనస్సు కాస్త శాంతించింది. ఇక మరణశిక్ష అమలే తరువాయి అని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ తీర్పును కేవలం ఆశాదేవి మాత్రమే కాదు సగటు ఆడపిల్లల తల్లితండ్రులు, నిర్భయకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరు స్వాగతించారు. అయితే శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చినంత మాత్రాన అది సత్వరమే అమలు కాదని తెలుసుకోవడానికి ఆశాదేవికి ఎక్కువ సమయం పట్టలేదు. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అలుపెరుగక కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మారుతున్న ప్రభుత్వాలు, ప్రసంగాలు దంచే నాయకులకు గుర్తుచేస్తూనే ఉంది.
ఇలాంటి తరుణంలో అనేక పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, న్యాయ ప్రక్రియల అనంతరం జనవరి 22, 2020లో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే దోషుల వరుస పిటిషన్లతో.. ఫిబ్రవరి 1 తర్వాత మార్చి 3కు వాయిదా పడింది. అనంతరం మార్చి 20న నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ ఉరితీయాలంటూ తాజా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ.. తాజాగా నిర్బయ దోషులు మరోసారి కోర్టు తలుపు తడుతున్నారు. భారత్‌లో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు ఏ పాపం తెలియదని.. తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేకు విన్నవించారు. (‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’)
మరోవైపు వారి కుటుంబ సభ్యులు తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయగా.. దోషుల్లో ఒకడైన అక్షయ్ భార్య మంగళవారం ఔరంగాబాద్ కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణ పూర్తయ్యేంత వరకు శిక్ష అమలు నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు దోషులు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి శిక్ష అమలు వాయిదా పడుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇన్నిసార్లు వాయిదాల గురించి వింటున్న, ఈ కేసు గురించిన వార్తలు చదువుతున్న మనకే ఇంతగా విసుగు వస్తుంటే.. ఇక ఆశాదేవి మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా భూదేవి అంత సహనంతో.. తన కూతురికి ఆలస్యంగానైనా తప్పక న్యాయం జరుగుతుందనే ఆశతో ఆమె ఎదురుచూస్తోంది. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని దోషుల తరపు లాయర్ తనను సవాలు చేసినా పోరాట పటిమతో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని ఒక్కోసారి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేసినా.. మానవ హక్కుల సంఘాల తీరును విమర్శించినా.. దాని వెనుక తల్లి ప్రేమ, ఏడేళ్ల సంఘర్షణ, మానసిక వేదనే తప్ప మరే ఇతర కారణాలు లేవన్న విషయాన్ని గ్రహించాలి. ఇంకోవిషయం... ఇన్నేళ్లుగా ఇంతగా పోరాడుతున్న ఆశాదేవి సంపన్నురాలేమీ కాదు. మెడలో కేవలం నల్లపూసల గొలుసు మాత్రమే ధరించే సాధారణ గృహిణి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పొలం అమ్మేసి మరీ కూతురిని చదివించిన వ్యక్తికి భార్య. ఇక గురువారం నాడు దోషులకు ఏ అవకాశాలు లేవంటూ కోర్టులు వారి పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘వారిని ఉరితీయబోతున్నారు. ఏడేళ్ల తర్వాత నా కూతురి ఆత్మకు శాంతి చేకూరబోతోంది. నాకు కూడా మనశ్శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి వ్యాఖ్యానించారు.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’)
దేశ వ్యాప్తంగా సాగుతున్న అకృత్యాల గురించి..
ఆ దోషులను(నిర్భయ దోషులు) కోర్టులో చూసిన ప్రతీసారీ నేను చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. నాలాగే నా కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషం. వాళ్లను చూసేందుకు ఈ రోజు నా కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉంది. లేకుంటే తాను కూడా ఎంతో వేదన అనుభవించేది. న్యాయం కోసం నేను చాలా ఓపికగా పోరాడుతున్నాను. అయితే 2012 నాటికి.. నేటికీ ఏమీ మారలేదు. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను. అయినా మా కూతుళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లపై ఎందుకు అత్యాచారాలకు పాల్పడి కాల్చివేస్తున్నారు. తల్లిదండ్రులుగా మా తప్పేం ఉంది. మేము ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం ఎదురుచూడాలి. ఓవైపు న్యాయపోరాటం జరుగుతుండగానే.. మరోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ దహనాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమస్యలకు వ్యవస్థ, సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుంది.
ముఖేశ్ సింగ్ తల్లి తనను అభ్యర్థించిన సందర్భంలో..
మా కూతురిని కోల్పోయాం. రక్తపు మడుగులో మునిగిన తన శరీరాన్ని చూశా. తన శరీరంపై ఉన్న గాయాలు.. తనపై క్రూర మృగాలు దాడి చేశాయా అన్నట్లు ఉన్నాయి. ఆనాటి నుంచి నా కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ... దయ చూపమని అర్థించడం నాపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏడేళ్లుగా ఏడ్చీ ఏడ్చీ నేనొక బండరాయిలా మారాను. అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూశాను. రోజూ చస్తూ.. బతుకుతున్నాను. అందుకే నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. రక్తపు కన్నీరు కారుస్తూ న్యాయ పోరాటం చేస్తున్నా.
రాజకీయ పార్టీల పరస్పర విమర్శల నేపథ్యంలో
నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఒక్క విషయం.. 2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారో.. ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోండి. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆ నలుగురికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి.
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment