నిర్భయ తల్లి(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్‌ను తొలగించిన కారణంగా తనకు మరింత గడువు ఇవ్వాలని నిర్భయ దోషి పవన్ గుప్తా కోర్టును అభ్యర్థించాడు. కొత్త లాయర్‌ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన (ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది.
ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. తన తరఫున వాదించేందుకు ఎవరూ లేని కారణంగా మరింత సమయం ఇవ్వాలని కోరాడు. ఇందుకు స్పందించిన కోర్టు.. తామే లాయర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలును జాప్యం చేసేందుకే దోషులు నాటకాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.(ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి)
‘‘దోషుల ఉరిశిక్ష అమలుకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా అడుగుతూనే ఉన్నాను. ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి వారికి డెత్ వారెంట్లు జారీ చేయలేదు. వారం రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు లాయర్ లేకుండా కోర్టుకు హాజరయ్యారు. బాధితురాలి తల్లినైన నేను ఇక్కడ ఉన్నాను. చేతులు కట్టుకుని న్యాయం కోసం అర్థిస్తున్నాను. మరి నా హక్కులు ఏమై పోయినట్లు’’ అని న్యాయమూర్తి ముందు తన బాధను వెళ్లగక్కారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘ఇక్కడ ప్రతీ ఒక్కరు మీ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి’’ అని సమాధానమిచ్చారు. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని)
ఇక నిర్భయ తరఫు లాయర్ వాదిస్తూ.. సోమవారం దాకా దోషులకు లాయర్‌గా వ్యవహరించిన ఏపీ సింగ్ ఏమయ్యారని.. ఇప్పుడు పవన్ గుప్తా తన లాయర్‌ను తొలగించుకోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘అతడికి గొప్ప లాయర్‌ను పెడతాం. ఇంకా వేరే ఏమైనా ఆప్షన్లు ఉన్నాయో ఆలోచిస్తాం’’అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్భయ తండ్రి మాట్లాడుతూ దోషులకు కోర్టు లాయర్‌ను నియమిస్తే.. నిర్భయకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు అని పేర్కొనగా.. వాళ్లకు లాయర్‌ను పెట్టకపోవడం అన్యాయం అవుతుందని జడ్జి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో నిర్భయ తల్లిదండ్రులు, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా కోర్టు ప్రాంగణంలో నిరసనకు దిగారు. దోషులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి)
కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. దోషులు వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇందులో భాగంగా.. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. ఇక ఈరోజు పవన్ తనకు లాయర్ లేడంటూ కొత్త నాటకానికి తెరతీశాడు. కాగా నిర్భయ దోషులను జనవరి 22న ఉరితీయాలంటూ తొలుత డెత్ వారెంట్లు జారీ కాగా... వారికి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో.. ఫిబ్రవరి 1 ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా కోర్టు మరోసారి వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు సూచించగా.. లాయర్ లేడంటూ మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment