నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి | Delhi Court Reserves Order Of Nirbhaya Convict Fresh Plea | Sakshi
Sakshi News home page

నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి

Published Tue, Mar 17 2020 3:48 PM | Last Updated on Tue, Mar 17 2020 6:00 PM

Delhi Court Reserves Order Of Nirbhaya Convict Fresh Plea - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ వరుసగా మరోసారి తాజా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా తనకు ఉన్న హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ సింగ్‌ పెట్టుకున్న పిటిషన్‌ సమర్థనీయం కాదంటూ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు దోషులు అక్షయ్ ఠాకూర్‌‌, పవన్ గుప్తా‌, వినయ్‌ శర్మ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.(మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!)

ఇక తాజాగా ముఖేశ్‌ సింగ్‌ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో అసలు తాను ఢిల్లీలో లేనని.. డిసెంబరు 17, 2012లో తనను పోలీసులు రాజస్తాన్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు గనుక.. తనకు ఉరిశిక్ష రద్దు చేయాలని  పిటిషన్‌లో కోరాడు. అదే విధంగా తీహార్‌ జైలులో అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొనగా... ముఖేశ్‌ సింగ్‌ ఉరిశిక్ష తేదీని మరోసారి వాయిదా వేయించాలనే దురుద్దేశంతోనే పిటిషన్‌ దాఖలు చేశాడని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ముఖేశ్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది.(ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement