న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొత్త లాయర్‌ను నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును అనుసరించి దోషి తరఫున వాదించేందుకు రవి ఖాజీ అనే న్యాయవాదిని నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా.. దోషి చివరి శ్వాస వరకు అతడి హక్కుల్ని, స్వేచ్చను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని పేర్కొంది. కాగా తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్‌ను తొలగించిన కారణంగా.. తాను కొత్త లాయర్‌ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని పవన్ గుప్తా కోర్టును కోరిన విషయం తెలిసిందే. (లాయర్ లేడట.. నేనేమో న్యాయం కోసం అడుక్కోవాలి: నిర్భయ తల్లి)
ఇదిలా ఉండగా.. నిర్భయ దోషి వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి తిరస్కరణను సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలులో జాప్యం చేసేందుకే దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ నలుగురు దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయడం కోసం డెత్‌వారెంట్లు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు డెత్ వారెంట్లు జారీ చేయలేమని పేర్కొంది. (నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు)
కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి... ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేసిన విషయం విదితమే. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.(నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ)
Comments
Please login to add a commentAdd a comment