నిరుత్సాహపు నీడలు
తెలుగుదేశం పార్టీ ‘గర్జన’ నీరుగారుతోంది. పార్టీ అధినేత ఎదుట తమ బలాన్ని నిరూపించుకునేందుకు గంటా బృందం ఎంతో ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమ వేదిక ఇంకా ఖరారు కాకపోవటంపై టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అనుకున్నట్లుగా బుధవారంనాడే గర్జనను నిర్వహించాలంటే ఈ రెండు రోజుల వ్యవధి చాలదని, వాయిదా వేయక తప్పదని భావిస్తున్నారు.
విశాఖపట్నం: తెలుగుదేశం ప్రజాగర్జన సభ వాయి దా పడనుంది. ఈనెల 12న పార్టీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యే ఈ సభను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో భారీస్థాయిలో నిర్వహించాలని పార్టీలోకి కొత్తగా చేరిన గంటా బృందం ఉవ్విళ్లూరింది. భారీస్థాయి జనసమీకరణ ద్వారా తమ బలం నిరూపించుకోవాలనుకుంది. చివర్లో సభా వేదిక అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పార్టీ నేతలు తలపోస్తున్నారు. వాస్తవానికి ప్రజాగర్జనను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విద్యాసంస్థల ఆవరణల్లో బహిరంగ సభలు నిర్వహించకూడదని సీపీ శివధరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏయూ వీసీ రాజు, ఇతర అధికారులు మాత్రం గంటా బృందానికి సాగిలపడి సభ నిర్వహించుకునేందుకు వీలుగా మద్దతుగా నిలిచారు. దీనిని సీపీ మాత్రం గట్టిగా వ్యవహరించారు. ఏయూ మైదానంలో నిర్వహించడానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ప్రస్తుతం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా విశాలక్షి నగర్‌లోని విశాఖపట్నం వెటర్నరీ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలంలో సభ ఏర్పాటు చేయాలని భావించారు. వన్‌టౌన్ ప్రాంతంలోని మరో మైదానం కూడా పరిశీలించారు. ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుల సమావేశంలో తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా జనం వచ్చే వీలుందని పలువురు సూచించారు.
సభా వేదికకు అనువైన స్థలం సిద్ధంగా ఉన్నా ఇంకా రెండురోజుల వ్యవధిలో ఏర్పాట్లు చేయడం సాధ్యమని తేల్చారు. దీంతో ప్రస్తుతం గంటా బృందం వెనుకడుగు వేస్తోంది. స్వల్ప వ్యవధిలో బహిరంగసభ నిర్వహిస్తే జనసమీకరణ ఇబ్బందిగా మారి తాము పార్టీలో చేరే విషయం పెద్దగా గుర్తింపులోకి రాదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సభ వాయిదావేయాలా? వద్దా?అనేది సోమవారం నగరానికి రానున్న పార్టీ సీనియర్ నేతలు గరికపాటి,యనమలతో కలిసి మాట్లాడి నిర్ణయించనున్నారు.