రఘుపై చర్యలు వద్దు | No action on Raghu | Sakshi
Sakshi News home page

రఘుపై చర్యలు వద్దు

Published Tue, Oct 10 2017 4:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

No action on Raghu - Sakshi

రఘుని కోర్టుకు తీసుకువెళ్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అవినీతిపరులైన అధికారులకు ప్రభుత్వమే దన్నుగా ఉంటే అడ్డేముంది. అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టుబడ్డ గోళ్ల వెంకట రఘు విషయంలో చంద్రబాబు సర్కారు తీరు ఇలానే ఉంది. ఆయనపై గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసిన విజిలెన్స్‌ విచారణ నివేదికపై చర్యలు నిలుపుదల చేస్తూ చంద్రబాబు సర్కారు గత నెల 21న ఏకంగా ప్రత్యేకంగా జీవోనే జారీ చేసింది. తద్వారా రఘుపై చర్యలు తీసుకోకుండా మోకాలడ్డింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత చక్రం తిప్పారని సమాచారం. అయితే ఏసీబీ ఆకస్మికంగా రఘుపై దాడులు చేయడంతో ఆయన అవినీతి వెలుగుచూసింది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే..
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు ఏసీబీకి పట్టుపడ్డ సంగతి తెల్సిందే. రఘు, ఆయన బినామీల ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.550 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో పనిచేసిన ఆయన అన్ని చోట్ల బినామీలను ఏర్పాటు చేసుకొని అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. గతంలో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సిటీ ప్లానర్‌గా పనిచేసిన కాలంలో బహుళ అంతస్తుల భవనానికి అక్రమంగా అనుమతులు ఇవ్వడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తు జరిపింది. ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించి ఆయనతోపాటు మరో ముగ్గురు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే దిగువస్థాయి ముగ్గురు అధికారులకు మినహాయింపు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రఘుపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని 2013, ఫిబ్రవరి 12న ఉత్తర్వులు ఇచ్చింది.

నివేదికను బుట్టదాఖలు చేసిన టీడీపీ ప్రభుత్వం
రఘుపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నివేదికపై చంద్రబాబు అధికారం చేపట్టిన మూడేళ్లలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మరీ విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరున రఘు పదవీ విరమణ చేయనుండటంతో ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ అదే నెల 21న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా జీవో నెంబర్‌ 662ను జారీ చేసింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఆఘమేఘాలపై జీవో జారీ చేయడం వెనుక ఒక కీలక నేత చక్రం తిప్పారని సమాచారం. 

అంతటి అవినీతిపరుడికి క్లీన్‌చిట్టా?: మధు
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కిన అవినీతి తిమింగిలం, రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ మాజీ డైరెక్టర్‌ జీవీ రఘుకు మున్సిపల్‌ శాఖ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదాయానికి మించి వందల కోట్ల ఆస్తులున్నట్టు, గతంలోనే ఆయనపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నా మంచివాడని కితాబు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పరిపాలనలో నిజాయితీ, పారదర్శకత అంటూ నిత్యం మాట్లాడుతున్న ప్రభుత్వం ఈ తరహా క్లీన్‌ చిట్‌ ఎలా ఇచ్చిందో తేల్చాలని ప్రజలు కోరుతున్నారన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పని చేసే ఒక ఉన్నతాధికారి ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే వందల కోట్ల రూపాయలు సంపాయించడం ఎలా సాధ్యం అని నిలదీశారు. ఈ విషయమై విచారించి వాస్తవాలు ప్రకటించాలని, రఘుకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement