ఆ అధికారం బాబుకు ఎవరిచ్చారు
రాష్ట్ర అవతరణ దినోత్సవం మార్పుపై ప్రముఖుల నిలదీత
విశాఖపట్నం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చే అధికారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎవరిచ్చారని విశ్రాం త ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుజాతి విచ్ఛిన్నమైన రోజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చారిత్రక తప్పిదమన్నారు. 2014జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, అది తెలుగుజాతి ఐక్యతాజ్యోతి కొడిగట్టిపోయిన రోజు అని గుర్తించాలన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జూన్2 ఎంతో అవమానకరమైన, అన్యాయంగా, అక్రమంగా, అసమతుల్యంగా విభజన జరిగిన రోజని సమైక్యవాదులు భావిస్తున్నారని చెప్పారు. తెలుగుప్రజల మనోభావాలను కించపరిచే విధంగా జూన్2 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రకటించడం దుర్మార్గపు చర్యన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం పోరాడిన రోజుని మార్చడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
అంతకీ మార్చాలనుకుంటే 1953 అక్టోబర్ ఒకటిన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు బలిదానం అయిన రోజుకైనా మార్చుకోవాలే తప్ప ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను తిరగరాయాలని భావించడం క్షంతవ్యం కాదన్నారు. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని పునఃపరిశీలించి నవంబర్ ఒకటినే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకటించడానికి ఎందుకు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టలేదో తెలపాలన్నారు.
బెల్టుషాపులు వద్దంటూనే.. డిస్టిలరీలా...
బెల్టుషాపులు వద్దంటూనే మరో వైపు ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం డిస్టిలరీలను విపరీతంగా విడుదల చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది తప్ప..వేరొకటి లేదన్నారు. ప్రభుత్వ ఆదా యం కోసం మంత్రి యనమల రామకృష్ణుడు లిక్కర్‌ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భావాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎక్సైజ్ ఆదాయంలో కనీసం ఒక శాతం మద్యం దుష్ఫలితాలపై ప్రచార కార్యక్రమాలకు కేటాయించాలని, రాష్ట్రం అదనంగా ఉత్పత్తి చేస్తున్న మద్యంను వెంటనే నిలిపివేయాలని పలు డిమాండ్లు చేశారు. సమావేశంలో ఏఆర్‌టీసీ సంస్థ ప్రతినిధి ప్రగడ వాసు తదితరులు పాల్గొన్నారు.