కేంద్ర ప్రభుత్వం ఉన్నఫలంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నవంబర్ 8వ తేదీని జనం మర్చిపోలేకపోతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి బుధవారం నాటికి సంవత్సరం పూర్తయినా నోట్ల కష్టాల నుంచి జనం ఇంకా తేరుకోలేకపోతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నుంచీ డబ్బుల కోసం జనం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నల్లధనాన్ని వెలికితీసి అవినీతి పరుల ఆటకట్టిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి దేశాన్ని సుసంపన్నం చేస్తామని పాలకులు గొప్పలు చెప్పడంతో నోట్ల రద్దును మొదట కొన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ... నాలుగు రోజుల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. పెద్దనోట్లు రద్దు..చిన్ననోట్ల కొరతతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
కరెన్సీ కోసం కటకట
పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు అందుకు అనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రెండు రోజులు గడవక ముందే ప్రజలను కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. ఏటీఎంలన్నీ మూతపడగా...బ్యాంకులు జనజాతరను తలపించాయి. పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాతి పడుకునేదాకా నిద్రాహారాలు మాని ఇంట్లో ఎందరంటే అందరూ బ్యాంకుల వద్ద పడిగాపలు కాశారు. రాజకీయ నాయకులు, కొందరు సంపన్న వర్గాలు, బ్యాంకు అధికారులు తెలిసిన కొందరు ఎలాగోలా డబ్బుల మార్పిడి, డిపాజిట్లు సులభంగా చేసుకున్నారు. 80 శాతం మంది సామాన్య, మ«ధ్య తరగతి, పేద వర్గాలు నోట్ల కష్టాలతో నానా అవస్థలు పడ్డారు.
అందరికీ ఇబ్బందే
నోట్ల రద్దుతో దాదాపుగా అందరూ ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో చేరిన వారు సకాలంలో డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. సామాజిక పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, నెలవారీ పెన్షన్ అందక విశ్రాంత ఉద్యోగులు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, కార్మికులు, కూలీలు... ఇలా ఒకవర్గం కాదు దాదాపు అన్ని వర్గాల ప్రజలు భయం గుప్పిట్లో బతికారు.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు వాటి పరిధిలో 457 శాఖలు పనిచేస్తున్నాయి. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో నగదు సరఫరా అంతంత మాత్రంగా ఉండటంతో పాక్షికంగా సేవలందించాయి. రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా డబ్బులు అందని పరిస్థితి. బ్యాంకు దగ్గర బారులు తీరినా మధ్యలో ‘నోక్యాష్–క్యాష్‌నిల్’ బోర్డులు దర్శనమిచ్చేవి. నోట్ల రద్దుకు ముందు ఒక్కో బ్యాంకు చెస్ట్‌లో రూ.50 నుంచి రూ.70 కోట్లు నిల్వ ఉండగా... నోట్ల రద్దుతో డబ్బంతా ఖాళీ అయ్యింది. ఇపుడు కూడా ఒక్కో చెస్ట్‌లో రూ.5 కోట్లకు మించి నిల్వ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సగానికిపైగా మూత
జిల్లా వ్యాప్తంగా 556 ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నా... గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 30 నుంచి 40 ఏటీఎంలకు మంచి పనిచేయలేదు. అవి కూడా పాక్షికంగా సేవలందించడంతో అన్ని వర్గాలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో సగానికి పైగా ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి.
నగదు రహితం...వేదనా భరితం
నగదు రహిత లావాదేవీలు అంటూ స్వైప్‌మిషన్లు, సేల్స్ మిషన్లు, మినీఏటీఎంలు, బడ్డీ, వాలెట్ యాప్‌లు అంటూ జనాన్ని భయంగుప్పిట్లోకి నెట్టేశారు. సంవత్సరం పూర్తయినా నగదు రహిత లావాదేవీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. 3 వేల వరకు స్వైప్‌మిషన్లు పంపిణీ చేసినా అందులో సగం కూడా పనిచేయలేదు. శింగనమల మండలం పెరవలి గ్రామాన్ని దత్తత తీసుకున్న సిండికేట్ బ్యాంకు వందశాతం నగదు రహితం చేస్తామని చెప్పినా 10 శాతం కూడా అమలు చేయలేక చతికిలపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఆశయం కూడా నెరవేరకపోవడంతో నోట్ల రద్దును మెజార్టీ ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నగదు రాక నరక యాతన
ఒక రోజు నగదు ఉంటుంది, మరొక రోజు ఉండేది కాదు. ఉద్యోగులు బ్యాంకు వెళ్లి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితి. నోట్ల రద్దు తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సంవత్సరమయినా అధికారులు ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఇప్పుడు కూడా ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు.
– రామాంజనేయులు, టీచర్, ఆనందరావుపేట
కూలీలకు డబ్బులివ్వలేకపోయాం
పెద్దనోట్లు రద్దు తర్వాత నగదు కోసం రైతులందరం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పటి నుంచి ఇ ప్పటి వరకు ఏటీఎంలు సక్రమంగా పని చేయకపోవడంతో పెట్టుబడుల కోసం, కూలీల డబ్బులు చెల్లింపుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పెనకచెర్లడ్యాంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో ఎప్పుడూ డబ్బులుండవు. బ్యాంకు వద్దకు వెళ్లి క్యూలో నిలబడి నగదు తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఏటీఎంలు ఉన్న ప్రయోజనం లేదు.
– నాగలింగారెడ్డి, రైతు, పెనకచెర్ల
Comments
Please login to add a commentAdd a comment