నో క్యాష్‌! | No Cash In Atm | Sakshi
Sakshi News home page

నో క్యాష్‌!

Published Tue, Jan 9 2018 10:46 AM | Last Updated on Tue, Jan 9 2018 10:46 AM

No Cash In Atm - Sakshi

కొత్త సంవత్సరంలో మళ్లీ పాత కథ మొదలైంది. కరెన్సీకోసం కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలవద్ద బారులు తీరిన జనాలు కనిపిస్తున్నారు. బ్యాంకుకెళ్తే... వారు నామమాత్రంగా మొత్తాలిచ్చి సరిపెడుతున్నారు. అక్కడా రద్దీ తప్పట్లేదు. సంక్రాంతి సమీపిస్తోంది. అన్నిరకాల అవసరాలూ ఇప్పుడే ఉంటాయి. బ్యాంకుల్లో మొత్తాలున్నాయిగానీ... అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందక రైతులు... ఉద్యోగులు... పెన్షనర్లు... చిరు వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు.

విజయనగరం అర్బన్‌/పార్వతీపురం/రామభద్రపురం: జిల్లాలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ  చూసినా కరెన్సీ కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రజానీకం డబ్బుల కోసం పూర్తిగా ఏటీఎంలపైనే అధారపడ్డారు. నగదు ఉన్న ఏటీఎంల కోసం ప్రజలు గాలించడం కనిపించింది. మధ్యాహ్నం 2.00 గంటల వరకు విజయనగరం పట్టణంలోని అన్ని ఏటీఎంలలోనూ నగదు పెట్టలేదు. ఆ తరువాత బ్యాం క్‌ శాఖలకు ఆనుకొని ఉన్న ఏటీఎంలో నగదు పెట్టడం కనిపించింది. సొమ్ముండీ ఖాతాదారులకు కరెన్సీ కష్టాలు తీరడంలేదు. నగదు తిప్పలు పది రోజులుగా మరింత పెరిగాయి. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు నానా యాతన అనుభవిస్తున్నారు. చాలా చోట్ల బాంకుల్లో నగదు నిల్వలు లేవు. కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్న మొత్తాలను బట్టి ఒక్కో ఖాతాదారుకి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు.

289 ఏటీఎంలో పనిచేసినవి 80
జిల్లా వ్యాప్తంగా 289 జాతీయ, గ్రామీణ బ్యాంకులున్నా యి. వీటికి నుబంధంగా 267 ఏటీఎంలున్నాయి. గ్రామాల్లో 74, పట్టణాల్లో 193 ఏటీఎంలు న్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.12 కోట్ల వరకు నగదు లావాదేవీలు అవుతాయి, సంబంధిత బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచి రోజుకు కనీసం  రూ.10 కోట్ల వంతున వారంలో కనీసం ఒక్కసారైనా నగదు పంపిణీ చేసే బ్యాంక్‌ చెస్ట్‌ కేంద్రాలకు వస్తాయి. ఒకటో తేదీకే వారానికి సరిపడే నగదును ఆర్‌బీఐ పంపిణీ చేయాలి. కానీ తాజాగా జనవరి నెలకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఒక్కపైసాకూడా రాలేరు. దీం తో ఏటీఎంలకు నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులో జరిగి న లావాదేవీల వల్ల వచ్చే మొ త్తాన్ని మాత్రమే ఏటీఎంలకు చేరుస్తున్నారు. సహజంగా దా చుకున్న సొమ్ములు సంక్రాం తి పండగ ఖర్చుకోసం జనవరినెలలో తీసుకుంటారు. వా రం రోజులుగా నగదు చేతికి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రైతన్నకు రబీ కష్టాలు
సాధారణంగా ఖరీఫ్‌లో పండిన పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని రబీకోసం పెట్టుబడి పెడతారు. ఆ విధంగా ధాన్యం, పత్తి వంటి పంటలు అమ్మగా వచ్చిన డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లగా డబ్బులు లేవని, రేపు మాపు అంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారు. దీనివల్ల రబీ సాగు పెట్టుబడులకు అప్పడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నాట్లు వేయడానికి, ఎరువులు కొనుగోలు, కూలీలకు, దుక్కులకు డబ్బులు చెల్లించడానికే గాదు... ఖరీఫ్‌ సాగుకు చేసిన అప్పులూ తీర్చాల్సి ఉంది. నగదు లేదన్న సాకుతో బ్యాంకర్లు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనజీవుల వెతలు
జిల్లాలొ దాదాపుగా 30వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగులు, 30 వేలమంది విశ్రాంత ఉద్యోగులు, 25 వేలమంది ఔట్‌సోర్సింగ్, 80 వేల వరకు ప్రైవేట్‌ ఉద్యోగులు, కార్మికులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా.. జీతాలు ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం, బ్యాంకర్లు నగదు కొరత అని చెప్పడం, ఏటీఎంలకు వెళితే నోక్యాష్‌ బోర్డులు కనిపించడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. జీతం కోసం విధులు మానుకొని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10 వేలు మాత్రమే ఇస్తుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్వతీపురంలో కొన్నింటే నగదు
పార్వతీపురం పట్టణంలో 20 వరకు ఏటీఎం సెంటర్లుండగా కొన్ని సెంటర్లలోనే నగదు లభ్యమౌతోంది. చాలా ఏటీఎంలు ఏడాదిగా పనిచేయకపోగా, పనిచేస్తున్నవాటిలో నగదు నిల్వలు లేవు. బ్యాంకునకు వెళ్లి తీసుకుందామంటే అక్కడ చాంతాడంత క్యూ కనిపిస్తోంది. పండగ అవసరాలకోసం వచ్చేవారికి రూ.10 వేలకు మించి ఇవ్వడంలేదు.

మరోవైపు నోట్ల రద్దు పుకారు
ఇటీవల కాలంలో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో రెండు వేల రూపాయలను ఎవరూ తీసుకుకోవడానికి, ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి ఇష్టపడడంలేదు. అంతే గాకుండా వారి వద్ద ఉన్న రూ.500 నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీనివల్లే నగదు కొరత ఏర్పడుతోంది.

రామభద్రపురానికి చెందిన ఈయన పేరు కనిమెరక వెంకటి. ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఈయన పదిహేను రోజుల క్రితం దానిని విక్రయించారు. మొత్తం 40 క్వింటాళ్ల పత్తికి రూ. లక్ష 60 వేల పైచిలుకు నగదు స్టేట్‌బ్యాంకు ఖాతాలో జమయింది. ఇప్పుడు ఆయనకు డబ్బు అవసరం కాగా బ్యాంకులో నగదు లేకపోవడంతో బ్యాంకర్లు ఇవ్వలేకపోతున్నారు. ఏటీఎంలు... బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండు మూడు రోజులకోసారి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన ఈయన పేరు కె.జగ్గునాయుడు. ఈయన పాల సొసైటీకి కార్యదర్శి కావడంతో పాలు సరఫరా చేసిన పాడి రైతులకు పదిహేను రోజులకోసారి పేమెంట్లు ఇవ్వాలి. విశాఖ డెయిరీ రూ.40 కోట్ల వరకు లావాదేవీలు ఉం టాయనీ అయినా రూ. లక్ష,59 వేలు నగదు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించడం లేదనివాపోతున్నారు. పాడి రైతులు పశువుల పోషణకు, కుటుంబపోషణకు ఇబ్బందులు పడుతున్నారనీ, తననూ అనరాని మాటలు అం టున్నారనీ చెప్పారు. బ్యాంకర్లు మాత్రం నగదు నిల్వ లేదు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement