సాక్షి, సంగారెడ్డి: వ్యవసాయ శాఖాధికారుల నిర్లిప్తత కరువు రైతులను నట్టేట ముంచింది. వెల్దుర్తి, దౌల్తాబాద్ మండలాల్లో కరువొచ్చి కళ్లెదుటే ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూశారు. పంట నష్టంపై అంచనాల తయారీ ఊసే ఎత్తలేకపోయారు. ఆనాటి నిర్లక్ష్యమే ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. ఈ రెండు మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా బాధిత రైతులకు ఊరట లేకుండా పోయింది. పంట నష్టంపై అంచనాలే సమర్పించకపోవడంతో ‘ఇన్‌పుట్ సబ్సిడీ’ మంజూరుకు అవకాశం లేకుండాపోయింది.
గత ఏడాది జూన్, జూలై నెలలు ఎడతెరపి లేని వర్షాలు కురిశాయి. ఆగస్టు పూర్తిగా వట్టిపోయింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 213.3 మి.మీటర్లు అయితే వాస్తవానికి 113.2 మి.మీటర్లు మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఆ నెలలో 46.9 శాతం తక్కువ వర్షం కురిసింది. ప్రధానంగా వెల్దుర్తి, దౌల్తాబాద్ మండలాల్లో నెలకొన్న వర్షాభావం వల్ల వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే.. దౌల్తాబాద్‌లో 36 శాతం, వెల్దుర్తిలో 22.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో బోరు బావుల కింద సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు ఆగస్టు నెలాఖరులోగా ఎండిపోయాయి. ‘మెతుకు సీమపై కరువు మేఘం’ శీర్షికతో గత సెప్టెంబర్ 4న ప్రచురించిన కథనం ద్వారా ఈ అంశాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా.. వ్యవసాయ అధికారులు ఎండిన పంట పొలాలను పరిశీలించే పాపానికి పోలేదు.
జిల్లాలో ఎక్కడా కరువు పరిస్థితులు లేవని.. పంటలు ఎక్కడా ఎండ లేదని కొట్టిపారేశారు. అయితే, ఇతర జిల్లాల నుంచి కరువు మండలాల ప్రకటన కోసం ప్రతిపాదనలు అందినా, జిల్లా నుంచి అందకపోవడంతో ప్రభుత్వ ఉన్నత వర్గాలు స్వయంగా రంగంలో దిగి ఆరా తీశాయి. దీంతో స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖ నెల రోజుల కింద వర్షాపాతం, పంటల సాగు విస్తీర్ణం వివరాలతో ప్రభుత్వానికి కరువు నివేదికను పంపించింది. ఈ నివేదిక ఆధారంగా గత శనివారం ప్రభుత్వం వెల్దుర్తి, దౌల్తాబాద్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు ఎండిపోయాయి..బాధిత రైతులు ఎవరెవరన్న అంశంపై అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదిక పంపించి ఉంటే సమీప భవిష్యత్తులో ఆయా రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందేది. అయితే, అప్పట్లో పంట నష్టంపై అంచనాలే తయారు చేయకపోవడంతో రైతులకు పంట నష్ట పరిహారం మంజూరీకి అవకాశం లేకుండా పోయింది. ఈ రెండు మండలాల్లో వ్యవసాయ రుణాల రీ షెడ్యూలింగ్ చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. రైతులకు ఇతర ప్రయోజనల్లేవని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాయితీ రానట్టే!
Published Mon, Jan 6 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement