
ఆర్భాటం కాదు ఆచరణ కావాలి
మనుబోలు: జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ఐదు అంశాలపై ప్రచార ఆర్భాటం కాకుండా ఆచరణ అవసరమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ పేదల జీవన విధానంలో మార్పు రాకుండా పేదరికంపై గెలుపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి సరిపడా ఉపాధ్యాయులు, మౌలిక వసతులు కల్పించకుండా బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, రుణాలు, సాగు నీటి వసతి, మద్దతు ధర తదితర సదుపాయాలు కల్పించకుండా పొలం పిలుస్తోంది అంటూ ఆర్భాటంగా రైతు సదస్సులు నిర్వహించినందువల్ల ప్రయోజమేమిటని ప్రశ్నించారు. పారిశుధ్యానికి నిధులు కేటాయించకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమన్నారు. పింఛన్లను రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచడం శుభ పరిణామమన్నారు. అయితే దీని సాకుతో వేలాది మంది అర్హులైన పేదల పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు.
అర్హులైన వారందరికి తిరిగి పింఛన్లు అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పక్షంలో ఉన్నందున తాను విమర్శలు చేయడం లేదని ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామని, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి ప్రతినిధిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలన్నిటినీ చిత్తశుద్ధితో ప్రణాళికాబద్దంగా చేసినప్పుడే జన్మభూమి కార్యక్రమానికి సార్థకత ఉంటుందన్నారు.
అలా కాకుండా ప్రచారార్భాటంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే పార్టీ పరంగా ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. బద్దెవోలు రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ హేమలత, ఏఓ శేషగిరి, నాయకులుదనుంజయరెడ్డి, విజయ్‌రెడ్డి, మన్నెమాల సుధీర్‌రెడ్డి, సాయిమోహన్‌రెడ్డి, చేవూరి ఓసూరయ్య, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, వెందోటి భాస్కర్‌రెడ్డి ఉన్నారు.