సాక్షి, ఒంగోలు : దీపావళి.. వెలుగు నింపే పండుగ. ఇంటి ముంగిట దీపాల వరుసలు, కొత్త దుస్తులు, పిండివంటలతో ఇంటిల్లిపాదీ సంతోషంతో వెలిగిపోతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పండుగ కళ తప్పింది. వెలుగుల పండుగ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది.
సమైక్యాంధ్ర బంద్, వర్షాల ప్రభావం..
సమైక్యాంధ్ర బంద్ కారణంగా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు..ఇలా ఒకరేమిటి? అన్ని వర్గాల వారిపై మోయలేని, కోలుకోలేని ప్రభావం పడింది. సుమారు మూడు నెలలపాటు జీతాల్లేక ఉద్యోగులు, వ్యాపారాలు సజావుగా జరగక వ్యాపారులు, చదువులు కుంటుపడి విద్యార్థులు... ఇలా అన్ని రకాలుగా ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పెట్రోలు, డీజిల్ ధరలు తరచుగా పెరుగుతూ వాటి ప్రభావం నిత్యావసర వస్తువులు, రవాణా రంగంపై పడడంతో ఏ వస్తువూ కొనలేని, తినలేని పరిస్థితి దాపురించింది. కూరగాయలు, ఆకు కూరల ధరలు కూడా భగ్గుమంటూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఇటీవల విద్యుత్ కోతలతో పరిశ్రమలు అనేకం మూతపడ్డాయి. భారీ పరిశ్రమలపై కూడా ఈ భారం పడడంతో ఉత్పత్తి సక్రమంగా లేక, కార్మికులకు పనులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇన్ని బాధలు ఎలాగోలా పడుతున్నా... తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. సాగుచేసిన పత్తి, వరి, వేరుశనగ, కంది తదితర పంటలతోపాటు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతన్న కుప్పకూలిపోయాడు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో రైతుల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు.
మరోవైపు పేదలు నివసించే అనేక కాలనీలు ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి. ఇళ్లలో ఉండే ధాన్యం, ఇతర వస్తువులన్నీ నీటిపాలు కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో భారీగా సాగులో ఉన్న రొయ్యల గుంటలను వరద నీరు ముంచెత్తడంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రొయ్యల రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల వారికి పండుగ జరుపుకోవడం భారమే.
పేలుతున్న టపాసుల ధరలు
పలు రకాల కారణాలతో ఆర్థికంగా సతమతమవుతున్న ప్రజలను ఈ ఏడాది భారీగా పెరిగిన టపాకాయల ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ధరలు ఎంతైనా తప్పనిసరిగా కాస్తోకూస్తో కొనాల్సి ఉన్నా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. శుక్రవారం ఉదయం జిల్లాలో కొద్దిపాటి వర్షం పడడంతో దీపావళి పండుగ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచన వ్యాపారులు, ప్రజల్లో ఉంది. భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన టపాకాయలు అమ్ముడవుతాయో లేదోనని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పోసొప్పో చేసి బాణసంచా కొన్నప్పటికీ, పండగ రోజు వర్షం కురిస్తే సంతోషం ఉండదు కదా అని ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు.
బోసిపోతున్న బంగారం దుకాణాలు
ఏటా దీపావళి సీజన్ వచ్చే సరికి కళకళలాడే బంగారం దుకాణాలు ఈసారి వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది సమైక్యాంధ్ర సమ్మె, వర్షాలతోపాటు పసిడి దిగుమతులు భారీగా తగ్గడం, ధరలు ఆకాశాన్ని అంటడం తదితర కారణాలతో బంగారం వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 20 శాతం కూడా వ్యాపారం జరగలేదని దుకాణదారులు చెబుతున్నారు. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మూడు నెలలుగా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని, సొంత దుకాణాలు, పెట్టుబడులు పెట్టే వారు ఎలాగోలా నిలదొక్కుకుంటున్నారు కానీ అద్దె దుకాణాలు నిర్వహించే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాపారులు వాపోతున్నారు. వంద గ్రాముల బంగారం బిస్కెట్ ధర ప్రస్తుతం రూ 3.11 లక్షల వరకు పలుకుతోంది. అయితే ధరలు రోజుకో విధంగా మారుతుండడం కూడా కొనుగోలుదారులను ఆ వైపు చూడనీయకుండా చేస్తోంది.