విద్యుత్ ఛార్జీలు 6 శాతం పెంచే అవకాశం: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులపై డిస్కంలు 6 శాతాన్ని భారాన్ని మోపాయని చెప్పారు. దాంతో విద్యుత్ చార్జీలను 6 శాతం పెంచాలని ఏపీ ఈఆర్సీ పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.7,700 కోట్లు నష్టాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే, 100 యూనిట్లు లోపు వాడినవారికి అదనపు ఛార్జీలు పెంచే యోచన లేదన్నారు. 100 యూనిట్లు వాడినవారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. కోటి 17 లక్షల కుటుంబాలపై విద్యుత్ భారం పడదని చంద్రబాబు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆలోచిస్తామన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.