
కర్నూలు(రాజ్‌విహార్) : ‘ఎమ్మిగనూరుకు చెందిన అశోక్ రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబానికి చెందిన ఇతడు ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం కింద చదువుకొని పట్టా తీసుకున్నాడు. తన వివరాలను జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదుకు వెళ్తే.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో నమోదు చేసుకోవాలని సూచించారు ఇక్కడి అధికారులు. దీంతో అక్కడికి వెళ్లే స్థోమత లేక వెనుదిరిగాడు’. ఈ సమస్య అశోక్ కుమార్ ఒక్కడి దే కాదు.. జిల్లాలో వేలాది మంది పట్టభద్రులు ఎదుర్కొంటున్నా సమస్య. ఇటు ఉపాధి కల్పన శాఖపైన నమ్మకం సన్నగిల్లడంతో ‘రిజిస్ట్రేషన్ చేయిస్తే ఏం ఉద్యోగాలొస్తాయిలే’ అనే అసంతృప్తిలో నిరుద్యోగులున్నారు.
నిరుద్యోగుల వివరాల నమోదుకు జిల్లాలో ఎలాంటి విభాగం లేకపోవడంతో ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం లేకుండా పోయింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ఏర్పాటు చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్‌లోనే పట్టభద్రుల వివరాలు లేవంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. సాధారణ డిగ్రీలందుకున్న విద్యార్థులకు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుంది. కానీ కొన్నేళ్లుగా ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేకపోవడంతో ఈ శాఖపై నిరుద్యోగులకు నమ్మకం లేకుండాపోయింది.
‘ఉన్నత’ పట్టా ఉంటే తిరుపతి ప్రయాణం
జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో కేవలం టెన్త్, ఇంటర్, యూజీ(అండర్ గ్రాడ్యుయేట్) పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. ఇక పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇక్కడి ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకునే వీలు లేదు. వీరు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరోలో వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఇక్కడ, అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఏళ్ల తరబడి ఎదురుచూసే నిరుద్యోగులకు ఎలాంటి కాల్ లెటర్లు అందకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆ శాఖపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా కొందరు రెన్యూవల్స్ చేయించుకోవడం మానేయగా, మరికొందరు అసలు నమోదు చేయించుకోవడానికే ఇష్టపడటంలేదు.
వేలల్లో పట్టాలు..
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీతో పాటు కృష్ణదేవరాయ, ఉర్దూ, ఎస్వీ, అంబేడ్కర్, యోగి వేమన, డ్రావిడియన్, పొట్టి శ్రీరాములు, ఉస్మానియా, తదితర యూనివర్సిటీల నుంచి ఏటా వేళల్లో డిగ్రీ, పీజీల పట్టాలు పొందుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీలు, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఇలా అనేక విభాగాల్లో పట్టాలు పొందినవారున్నారు. వీరిందరు కలిసి దాదాపు లక్షల్లో ఉన్నారు. అయితే వీరి వివరాలే ప్రభుత్వం వద్ద లేనప్పుడు నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన లాంటి సంక్షేమ పథకాల అమలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నంద్యాల ఎన్నికల ముందు భృతిపై హడావిడి..
నంద్యాల ఉప ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం హడావిడి చేసింది. ఓట్ల లబ్ధి కోసం మంత్రి వర్గం సమావేశమై చర్చించింది. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
7601 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు.
ఉపాధి కల్పన కార్యాలయంలో ఇప్పటి వరకు 7601 మంది మాత్రమే వారి వివరాలు నమోదు చేసుకున్నారు. పీజీలు, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ ఆపై డిగ్రీల పట్టాలు పొందిన వారి వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం ఇక్కడ లేదు. అలాంటి వారు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నమోదు చేసుకోవాలి.
-ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment