దాహంతో అలమటిస్తున్న ‘బుడ్మి’
తాగే నీరంతా ఫ్లోరైడ్‌మయమే
అయినా పట్టించుకోని అధికారులు
తెలిసినా స్పందించని నాయకులు
కీళ్లనొప్పులు, నడుము నొప్పులు వేధిస్తున్నాయి
ఆవేదన చెందుతున్న గ్రామస్తులు
రక్షిత మంచినీటి పథకానికి నోచుకోని ఊరు
ప్రతిపాదనలు పంపినాప్రయోజనం శూన్యం
ఆ గ్రామానికి ఫ్లోరైడ్ నీరు ప్రమాదకరంగా మారింది. ఆ నీటిని సేవించిన వారందరూ కీళ్లనొప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. దశాబ్దాలుగా వారు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాన్సువాడ మండలంలో మంజీరా నదికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బుడ్మి గ్రామస్తుల కన్నీటి గాథ ఇది. వారి వేదనను అటు అధికారులుగానీ, ఇటు నేతలుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది.
బాన్సువాడ, న్యూస్‌లైన్:
బుడ్మి గ్రామం పక్క నుంచి మంజీరానది గలగలా పారుతున్నా ఆ ఊరి దాహం మాత్రం తీరడం లేదు. ఫలి తంగా అందుబాటులో ఉన్న ఫ్లోరైడ్ నీటినే తాగుతూ ఆ గ్రా మస్తులు ఆనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ సుమారు రెండు వేల జనాభా ఉంది. వీరందరికీ బోరు నీరే దిక్కు. ఆ నీటిలో మొత్తం ఫ్లోరైడే ఉం డడం గమనార్హం. దశాబ్దాల క్రితమే గ్రామంలోని చేతి పంపులు, బోరుబావులను పరీక్షించిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆ నీళ్లను తాగవద్దని, కేవలం ఇంటి అవసరాలకే వినియోగించుకోవాలని సూచించారు. రక్షిత మంచినీటిని అందించే అందించే ఏర్పాటు మాత్రం చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యంతో బుడ్మి గ్రామం ఫ్లోరైడ్ భూతా నికి బలైపోతోంది.
యువకులకు కీళ్ల నొప్పులు
దశాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటిని సేవించడంతో మహిళలు, పురుషులు, ముసలివారు, యువకులు నడుమునొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కూలినాలి చేసు కునేవారు ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గ్రామస్తులు రూ. 12 నుంచి రూ. 20 వరకు వెచ్చించి బాన్సువాడ నుంచి మినరల్ వాటర్ బాటిళ్లు తెప్పించుకుంటున్నారు. నెలకు సుమారు రూ. 500 వరకు వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
సర్కార్ ఏం చేస్తోంది?
మంజీరకు కూతవేటు దూరంలోనే ఉన్న బుడ్మి గ్రామానికి నది నుంచి నీటిని తెప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయడం లేదు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు 2002-03లో గ్రామస్తులకు డీఫ్లోరైడ్ నీటిని అందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ. 8.50 లక్షలు మంజూరు చేయగా, బుడ్మి చౌరస్తా నుంచి గ్రామం వరకు పైప్‌లైన్ వేసి రోడ్డు పక్కన మూడు బోర్లు వేయించారు. అక్కడ కూడా నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థి తి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. విడుదలైన నిధులలో సుమారు రూ. నాలుగు లక్షలు వెనక్కివెళ్లాయి. తర్వాత రూ. 18.5 లక్షలతో కొత్త పైప్‌లైన్ నిర్మా ణా నికి ప్రతిపాదనలు పంపినా మంజూరీ లభించలేదు.
పరిష్కారమెలా?
బాన్సువాడ పట్టణానికి మంచినీటిని సరఫరా చేసేందుకు బుడ్మి గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో మంజీర ఫిల్టర్‌బెడ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఫిల్టర్‌బెడ్ నుంచి తాడ్కోల్ వరకు డీ ఫ్లోరైడ్‌నీటిని సరఫరా చేస్తున్నారు. తాడ్కోల్ నుంచి బుడ్మి చౌరస్తా వరకు సుమారు మూడు కిలోమీటర్ల పైప్‌లైన్ వేయిస్తే గ్రామ స్తులకు రక్షిత నీళ్లు అందుతాయి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడిన పని కూడా కాదు.
మాకు నల్లగొండ గుర్తుకస్తది
మేం అప్పుడప్పుడు నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితుల గురించి టీవీల్లో చూస్తుంటం. వాళ్లను చూస్తే మాకు కూడా అదే సమస్య ఉందని అనిపిస్తది. కానీ మా గురించి పట్టించుకొనేటోళ్లు లేరు. ప్రభుత్వాలు మారినా మా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఎన్నికలప్పుడే నాయకులు అస్తరు.
-వెంకట్రాములు, గ్రామస్తుడు
యవ్వనంలోనే కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులున్నాయని చెబితే స్నేహితులు, డాక్టర్లు వెక్కిరిస్తున్నారు. ఈ వయసులో నొప్పులేంటని ఎగతాళి చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి నీటి బొట్టు ఫ్లోరైడ్‌తో కూడుకుని ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి.
-జావీద్,
గ్రామ యువకుడు
ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి
సమస్య పరిష్కారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే పోచారం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాను. అధికారులు రక్షిత నీటి పథకం నిర్మాణానికి రూ. 18.5 లక్షల మంజూరు కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దానికింకా మోక్షం లేదు.
- జిన్న గంగాధర్, సర్పంచ్, బుడ్మి
మా గోడును పట్టించుకోరు
మా ఊరి జనం తక్కువ వయస్సులోనే ముసలోళ్లు అయిపోతున్నరు. యువకులు కీళ్ల నొప్పులు, నడుమునొప్పులతో బాధ పడుతున్నరు. కానీ సర్కారు పట్టించుకుంట లేదు. పదేళ్లుగా చెబుతున్నా ఎవ్వరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. అధికారులు వస్తరు, నాయకులు వస్తరు, వింటరు, పోతరు. మా బాధ మాత్రం తీరదు. ఇగ మా గోడు ఎవరికి చెప్పుకోవాలి సారూ? ఇప్పటికైనా మాకు ‘మంచి’నీళ్లు ఇప్పించండి. మా ఊరి బాధ తీర్చండి.
-కృష్ణమయ్య, గ్రామస్తుడు
మంజీర చెంత..తాగునీటి చింత
Published Tue, Jan 28 2014 2:58 AM | Last Updated on Fri, Oct 5 2018 8:48 PM
Advertisement
Advertisement