సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరిగేషన్ శాఖలో కొత్త పనులు పెద్దగా ప్రారంభం కాలేదు. సాగునీటి శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో చూస్తే భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పటికే కృష్ణా, గుంటూరు సర్కిల్ పరిధిలో నిర్మాణ సంస్థలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. కొత్త పనులకు టెండర్లు కూడా ఆహ్వానించక పోవడంతో ఇరిగేషన్ శాఖకు చెందిన కాంట్రాక్టర్లు ఇతర శాఖల్లో పనులు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రతీ చిన్న పనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకో వాల్సి ఉండటంతో కాలయాపన జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తరువాత కాంగ్రెస్ పాలనలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టా కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 5.71 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో ఉంది. ఈ జిల్లాల్లో కాలువల ఆధునికీకరణకు ప్రభుత్వం 2009లో రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. సాగునీటి కాల్వల ఆధునికీక రణకు రూ.835 కోట్లు, మురుగునీటి కాల్వల ఆధునికీకరణకు రూ. 562 కోట్లను కేటాయించింది. అగ్రిమెంట్ విలువలో ఇప్పటి వరకు అన్ని సంస్థలు కలిపి 40 శాతానికి మించి పనులు చేయలేదు. ఈ సంస్థలు ప్రస్తుత సీజనులో పనులు చేసే పరిస్థితిలో లేవు. ముఖ్యంగా వీటిపై మంత్రి వర్గ ఉప సంఘం, నిపుణుల కమిటీలు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఆ నివేదికపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిర్మాణసంస్థలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక సాంవత్సరిక మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన పనులకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. గత ఏడాది సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్ని బిల్లులు, పనులకు అనుమతులు ఇస్తూ హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులన్నింటిని టీడీపీ నిలిపివేసింది. అంతేకాకుండా ప్రతి కొత్తపనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించింది. దీంతో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు కూడా జాప్యం జరుగుతోంది.
పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు గ్రామంలో చెరువుకు పెద్ద గండిపడి అక్కడి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా గండిని పూడ్చి నీటిని నిల్వ చేయాల్సి ఉంది. దీనికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో ప్రజలు దాదాపు ఐదారు నెలల నుంచి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వచ్చే వేసవిలో నిర్వహించాల్సిన సాంవత్సరిక పనులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంచనాలు తయారు చేయాలో లేదో అర్థం కాని దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు.
కాంట్రాక్టర్ల ఇబ్బందులు...
ఇక గత ఏడాది నుంచి చేసిన పనులకు నగదు చెల్లింపులు లేక నిర్మాణ సంస్థల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.50 కోట్ల వరకు ఈ బకాయిలు ఉన్నాయి. వీటికోసం నిర్మాణ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమీప భవిష్యత్‌లో కొత్త పనులు వచ్చే అవకాశాలు కనపడక ఇక్కడ పనులు చేసే కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బి, రైల్వే, మున్సిపాల్టీల్లో పనులు చేసేందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పరిస్థితి ఇలా ఉండడంతో ఇరిగేషన్ శాఖ కార్యాలయాలన్నీ వెలవెలబోతున్నాయి.
డబ్బుల్లేవ్..పనుల్లేవ్ !
Published Mon, Feb 9 2015 2:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement