Irrigation dept
-
పదోన్నతులపై అదే పీటముడి
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయగా, తెలంగాణలో దాని ఊసే కనబడకపోవడం ఇక్కడి ఇంజనీర్లను కలవరపెడుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియార్టీ జాబితాను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ఏపీ మాత్రం కేవలం తన పరిధిలోని నాలుగు జోన్ల ఇంజనీర్ల జాబితానే ఇవ్వడం..తెలంగాణ పరిధిలోని ఐదు, ఆరు జోన్ ఇంజనీర్ల జాబితాను సమర్పించకపోవడంతో పదోన్నతులపై పీటముడి నెలకొంది. నీటి పారుదల శాఖలో పదోన్నతుల సమస్య ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉంది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు జోన్–6లో ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారు. ఈ అంతరం పెరుగుతూ వస్తుండటంతో ప్రస్తుతం ఈ శాఖలో ముగ్గురు ఈఎన్సీలు, 23 మంది చీఫ్ ఇంజనీర్లు అంతా జోన్–5కి చెందిన వారే ఉన్నారు. దీనికి తోడు 45 సూపరింటెండెంట్ పోస్టుల్లో 28 మంది ఐదో జోన్ ఇంజనీర్లే ఉన్నారు. ఈ అన్యాయాన్ని కొత్త రాష్ట్రం తెలంగాణలో అయినా సవరించాలని జోన్–6 ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో వారికి న్యాయం చేసేలా నీటి పారుదల శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకా రం న్యాయం జరుగుతుందనుకున్న సమయం లో 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ పదోన్నతులకు సీనియార్టీ జాబితా సిద్ధమైంది. దీనిపై జోన్–6 ఇంజనీర్లు కొందరు హైకోర్టుకు వెళ్లగా, కొత్తగా తయారు చేసిన జాబితాపై హైకోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియార్టీ జాబితాను ఏపీ సమర్పించాలని, దానికి అనుగుణంగా తెలంగాణ నీటి పారుదల శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలివ్వని ఏపీ అయితే ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టుకు సీనియార్టీ జాబితాను సమర్పించిన ఏపీ సర్కారు కేవలం తన పరిధిలోని నాలుగు జోన్ల వివరాలనే అందజేసింది. ఐదు, ఆరు జోన్ల జాబితాను ఇవ్వలేదు. ఇదే సమయంలో సుప్రీంకు సమర్పించిన జాబితా ప్రకారమే ఏపీ తన పరిధిలోని ఇంజనీర్లకు పదోన్నతులు సైతం కల్పించింది. అయితే తెలంగాణలో మాత్రం పదోన్నతుల అంశం ఇంకా నలుగుతూనే ఉంది. ఇలాంటి సమస్యే పోలీస్ శాఖలో కూడా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని జోన్–6 ఉద్యోగులకు న్యాయం చేశారని, అదే తరహాలో తమకూ న్యాయం చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు మొర పెట్టుకుంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ సీఎస్ ఎస్కే జోషిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు. -
దోచిపెట్టింది రూ.170 కోట్లు
అడ్డదారిలో గడువు పొడిగింపులు.. ‘లిక్విడేట్ డ్యామేజ్’ నిబంధనను అతిక్రమించి కోట్లకు కోట్లు చెల్లింపులు.. మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుని ఎనిదేళ్లు దాటినా పూర్తి చేయని నిర్లక్ష్యం...పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ‘కాగ్’కు కనిపించిన అక్రమాలు..అవినీతి ఊటలు ఇవి..! సాక్షి ప్రతినిధి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువును ఇప్పటి వరకు 13 సార్లు పొడిగించడం పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని కోరినా.. సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వడానికి సాగునీటి శాఖ పాట్లు పడుతోంది. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ 2004 అక్టోబర్‌లో ఒప్పందం మీద సంతకాలు పెట్టింది. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 36 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. 36 నెలల గడువు ముగిసి 8 సంవత్సరాల 8 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఇంకా 90 శాతం పనులే పూర్తయ్యాయి. కనీసం పనుల ప్రగతి నివేదికను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను అడగడం లేదని ఆక్షేపించింది. ఈమేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), సాగునీటి శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. గడువు పొడిగిస్తే.. అదనపు చెల్లింపులకు అవకాశం లేదు.. గడువు పొడిగిస్తే.. కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని నిబంధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గడువు పొడిగించిన వెంటనే కాంట్రాక్టర్‌కు ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలి. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధిస్తే.. ధరల సర్దుబాటు కింద అదనపు చెల్లింపులు అడిగే అర్హతను కాంట్రాక్టర్ కోల్పోతారు. అయితే ధరల సర్దుబాటు కింద ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్లు అదనంగా చెల్లించారు. అడ్డదారిలో గడువు పొడిగింపు గడువు పొడిగింపు ప్రతిపాదన క్షేత్రస్థాయి నుంచి రావాలి. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడితే.. గడువు పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదన వస్తుంది. పొడిగింపు ప్రతిపాదనపై హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) సంతకాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దలు పక్కనబెట్టారు. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిపాదనపై రాస్తే.. కాంట్రాక్టర్ రూ. వందల కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని, కమీషన్లు కూడా రావనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు అలా చేస్తున్నారని సాగు నీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు. పులిచింతల ముఖం చూడని ముఖ్యమంత్రి .... ప్రాజెక్టు వద్ద నిద్రపోతానని, ఇంజనీర్ల గుండెల్లో నిద్రపోతానని ప్రతి సమీక్షాసమావేశంలో రెండేళ్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా పులిచింతల ప్రాజెక్టును సందర్శించకపోవడం గమనార్హం. ప్రాజెక్టు భద్రత లేమి, పనులు చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..ప్రస్తావనకు వస్తే.. కాంట్రాక్టర్‌కు అదనంగా కోట్లాదిరూపాయలు చెల్లించడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే సీఎం.. ప్రాజెక్టును సందర్శించలేదని ఇంజనీర్లు అంటున్నారు. నాలుగు డివిజన్లకు స్థాన చలనం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ కోసం ఐదు డివిజన్లు, ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పని పూర్తి కాకుండానే నాలుగు డివిజన్లను పులిచింతల నుంచి తరలించారు. దీంతో ఒక డివిజన్లో ఉన్న సిబ్బంది పనుల పర్యవేక్షణకు సరిపోవడం లేదని, సిబ్బంది మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బుల్లేవ్..పనుల్లేవ్ !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరిగేషన్ శాఖలో కొత్త పనులు పెద్దగా ప్రారంభం కాలేదు. సాగునీటి శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో చూస్తే భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పటికే కృష్ణా, గుంటూరు సర్కిల్ పరిధిలో నిర్మాణ సంస్థలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. కొత్త పనులకు టెండర్లు కూడా ఆహ్వానించక పోవడంతో ఇరిగేషన్ శాఖకు చెందిన కాంట్రాక్టర్లు ఇతర శాఖల్లో పనులు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రతీ చిన్న పనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకో వాల్సి ఉండటంతో కాలయాపన జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తరువాత కాంగ్రెస్ పాలనలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 5.71 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో ఉంది. ఈ జిల్లాల్లో కాలువల ఆధునికీకరణకు ప్రభుత్వం 2009లో రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. సాగునీటి కాల్వల ఆధునికీక రణకు రూ.835 కోట్లు, మురుగునీటి కాల్వల ఆధునికీకరణకు రూ. 562 కోట్లను కేటాయించింది. అగ్రిమెంట్ విలువలో ఇప్పటి వరకు అన్ని సంస్థలు కలిపి 40 శాతానికి మించి పనులు చేయలేదు. ఈ సంస్థలు ప్రస్తుత సీజనులో పనులు చేసే పరిస్థితిలో లేవు. ముఖ్యంగా వీటిపై మంత్రి వర్గ ఉప సంఘం, నిపుణుల కమిటీలు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఆ నివేదికపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిర్మాణసంస్థలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక సాంవత్సరిక మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన పనులకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. గత ఏడాది సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్ని బిల్లులు, పనులకు అనుమతులు ఇస్తూ హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులన్నింటిని టీడీపీ నిలిపివేసింది. అంతేకాకుండా ప్రతి కొత్తపనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించింది. దీంతో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు కూడా జాప్యం జరుగుతోంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు గ్రామంలో చెరువుకు పెద్ద గండిపడి అక్కడి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా గండిని పూడ్చి నీటిని నిల్వ చేయాల్సి ఉంది. దీనికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో ప్రజలు దాదాపు ఐదారు నెలల నుంచి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వచ్చే వేసవిలో నిర్వహించాల్సిన సాంవత్సరిక పనులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంచనాలు తయారు చేయాలో లేదో అర్థం కాని దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. కాంట్రాక్టర్ల ఇబ్బందులు... ఇక గత ఏడాది నుంచి చేసిన పనులకు నగదు చెల్లింపులు లేక నిర్మాణ సంస్థల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.50 కోట్ల వరకు ఈ బకాయిలు ఉన్నాయి. వీటికోసం నిర్మాణ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమీప భవిష్యత్‌లో కొత్త పనులు వచ్చే అవకాశాలు కనపడక ఇక్కడ పనులు చేసే కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బి, రైల్వే, మున్సిపాల్టీల్లో పనులు చేసేందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పరిస్థితి ఇలా ఉండడంతో ఇరిగేషన్ శాఖ కార్యాలయాలన్నీ వెలవెలబోతున్నాయి.