దోచిపెట్టింది రూ.170 కోట్లు
దోచిపెట్టింది రూ.170 కోట్లు
Published Thu, Aug 4 2016 8:49 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
అడ్డదారిలో గడువు పొడిగింపులు.. ‘లిక్విడేట్ డ్యామేజ్’ నిబంధనను అతిక్రమించి కోట్లకు కోట్లు చెల్లింపులు.. మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుని ఎనిదేళ్లు దాటినా పూర్తి చేయని నిర్లక్ష్యం...పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ‘కాగ్’కు కనిపించిన అక్రమాలు..అవినీతి ఊటలు ఇవి..!
సాక్షి ప్రతినిధి, అమరావతి:
పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువును ఇప్పటి వరకు 13 సార్లు పొడిగించడం పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని కోరినా.. సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వడానికి సాగునీటి శాఖ పాట్లు పడుతోంది. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ 2004 అక్టోబర్‌లో ఒప్పందం మీద సంతకాలు పెట్టింది. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 36 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. 36 నెలల గడువు ముగిసి 8 సంవత్సరాల 8 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఇంకా 90 శాతం పనులే పూర్తయ్యాయి. కనీసం పనుల ప్రగతి నివేదికను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను అడగడం లేదని ఆక్షేపించింది. ఈమేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), సాగునీటి శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి.
గడువు పొడిగిస్తే.. అదనపు చెల్లింపులకు అవకాశం లేదు..
గడువు పొడిగిస్తే.. కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని నిబంధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గడువు పొడిగించిన వెంటనే కాంట్రాక్టర్‌కు ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలి. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధిస్తే.. ధరల సర్దుబాటు కింద అదనపు చెల్లింపులు అడిగే అర్హతను కాంట్రాక్టర్ కోల్పోతారు. అయితే ధరల సర్దుబాటు కింద ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్లు అదనంగా చెల్లించారు.
అడ్డదారిలో గడువు పొడిగింపు
గడువు పొడిగింపు ప్రతిపాదన క్షేత్రస్థాయి నుంచి రావాలి. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడితే.. గడువు పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదన వస్తుంది. పొడిగింపు ప్రతిపాదనపై హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) సంతకాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దలు పక్కనబెట్టారు. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిపాదనపై రాస్తే.. కాంట్రాక్టర్ రూ. వందల కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని, కమీషన్లు కూడా రావనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు అలా చేస్తున్నారని సాగు నీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు.
పులిచింతల ముఖం చూడని ముఖ్యమంత్రి ....
ప్రాజెక్టు వద్ద నిద్రపోతానని, ఇంజనీర్ల గుండెల్లో నిద్రపోతానని ప్రతి సమీక్షాసమావేశంలో రెండేళ్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా పులిచింతల ప్రాజెక్టును సందర్శించకపోవడం గమనార్హం. ప్రాజెక్టు భద్రత లేమి, పనులు చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..ప్రస్తావనకు వస్తే.. కాంట్రాక్టర్‌కు అదనంగా కోట్లాదిరూపాయలు చెల్లించడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే సీఎం.. ప్రాజెక్టును సందర్శించలేదని ఇంజనీర్లు అంటున్నారు.
నాలుగు డివిజన్లకు స్థాన చలనం
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ కోసం ఐదు డివిజన్లు, ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పని పూర్తి కాకుండానే నాలుగు డివిజన్లను పులిచింతల నుంచి తరలించారు. దీంతో ఒక డివిజన్‌లో ఉన్న సిబ్బంది పనుల పర్యవేక్షణకు సరిపోవడం లేదని, సిబ్బంది మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement