రాజాంలోని ఓ ఏటీఎం వద్ద నగదు కోసం క్యూ
పండుగ వేళ జిల్లా వాసులకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఏటీఎంల్లో బ్యాంకు అధికారులు పెడుతున్న క్యాష్‌ను జనం క్షణాల్లో ఊడేస్తున్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో నగదును కూడా ఖాతాదారులు భారీగా విత్‌డ్రా చేయడంతో కరెన్సీ కష్టాలు నెలకొన్నాయి.
రాజాం/ శ్రీకాకుళం: సుమారు రెండేళ్ల క్రితం ఏర్పడిన నగదు కష్టాలు మళ్లీ చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు కారణంగా నగదు కష్టాలు ఏర్పడగా, ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో జనం తమ ఖాతాల నుంచి నగదు ఒకేసారి తీస్తుండడంతో బ్యాంకుల్లో నగదు నిం డుకుంది. దీంతో అటు పట్టణ ప్రాంతంతో పాటు ఇటు పల్లె గ్రామాల్లో కూడా కరెన్సీ కష్టాలు అధికమయ్యాయి. గడచిన మూడు రోజులుగా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అప్పుడప్పుడూ ఏటీఎంలలో నగదు పెడుతున్నా కొద్ది నిమిషాల్లోనే అవన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో కొన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులు సమ్మెలోపాల్గొన్నాయి. అప్పటి నుంచి ఖాతాదారులు నగదు కోసం ఏటీఎంలపైనే ఎక్కువుగా ఆధారపడుతూ వచ్చారు. సాధారణంగా నగదును తీసుకోవడానికి ఇటీవల ఎక్కువమంది ఖాతాదారులు ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలియనది కాదు.
బ్యాంకు యాజమాన్యాలు కూడా ఎటీఎంల వాడకాలను పెంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చారు. ప్రచారం చేసినంతగా ఏటీఎంలను నిర్వహించడం లేదన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. పండుగ పూట నగదు లావాదేవీలు ఎక్కువుగా జరుగుతాయి. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏటీఎంలలో నగదును ఉంచే ఏర్పాట్లు చేయకపోవడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. విత్‌డ్రాతో పాటు, ఈ కార్నర్‌లలో డిపాజిట్ చేసుకొనేందుకు కూడా ప్రజలు తంటాలు పడ్డారు. కొన్నిచోట్ల యంత్రాలు పనిచేయకపోగా, మరికొన్ని చోట్ల నగదు నిండుుకోవడంతో డిపాజిట్లు జరగలేదు. ఇలా అన్ని విధాలుగా ఖాతాదారులు నగదు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంగళవారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రోజు కూడా అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
పరిమిత విత్‌డ్రాలు..
రాజాంలో 27 బ్యాంకులకు చెందిన బ్రాంచిలు ఉన్నాయి. వీటిలో కూడా నగదు నిండుకుంది. ఒక్క రాజాం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో మాత్రమే నగదు ఉంది. అక్కడ కూడా కొరతగా ఉండడంతో ఒక్కో ఖాతాదారునికి రూ. 10 వేలు మాత్రమే విత్‌డ్రా ఇస్తున్నారు. సంతకవిటి, రేగిడి, వంగరలో ఈ పరిస్థితి మరీదారుణంగా ఉంది. ప్రస్తుతం దాన్యం విక్రయిస్తున్న రైతులకు కూడా సకాలంలో నగదు అందని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో నగదులేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మా గ్రామంలోని బ్యాంకులో నగదు కొరత ఉంది. ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడానికి రాజాం వస్తే ఏ ఏటీఎంలో డబ్బులు లేవు. పండగ సమయంలో నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాం.
– గుడ్ల అప్పారావు,రైతు, అప్పలఅగ్రహారం, సంతకవిటి మండలం.
Comments
Please login to add a commentAdd a comment