వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే కీలక వ్యక్తుల్లో ఆశా కార్యకర్తలు ఒకరు. ప్రస్తుతం కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో వారిని ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా ఎంత మంది కొత్త కుష్ఠు వ్యాధి గ్రస్తులు ఉన్నారనే విషయమై గత నెలలో ఇంటింటికి తిరిగి ఆశాలు సర్వే నిర్వహించారు.ఇందుకు గాను వారికి ప్రోత్సాహక నగదు ఇవ్వాలి. అయితే, గతంలో లాగే ఇప్పుడు కూడా ప్రోత్సాహక నగదు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కొత్తగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆశాలు/అంగన్‌వాడీ కార్యకర్తలు/మెప్మా సిబ్బంది గత నెల 2వ తేదీ నుంచి 15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ప్రతి బృందంలో ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరు జిల్లాలోని 44,40,488 జనాభాకు గాను 33,36,872 మందిని పరీక్షించినట్లు అధికారుల లెక్కలు తేల్చారు. పరీక్షించిన వారిలో 3,645 మందికి కుష్ఠు వ్యాధిలక్షణాలు ఉండటంతో వైద్యపరీక్షలు చేయించారు. చివరగా 115 మందికి మాత్రమే వ్యాధి ఉన్నట్లు నిర్దారణ చేశారు. ఈ కార్యక్రమానికి గాను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి జిల్లాకు రూ.70 లక్షలకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఆశావర్కర్లు, మేల్ వలంటీర్లకు అవగాహన కల్పించేందుకు, ప్రచారం కోసం కొంత ఖర్చు చేశారు. మిగిలిన మొత్తంలో సర్వే చేసిన ఆశాలకు ప్రోత్సాహక నగదు కింద రోజుకు రూ.75 చొప్పున రెండు వారాలకు గాను రూ.1050 అందజేస్తారు.
ప్రోత్సాహక నగదు ఇవ్వడంలో మీనమేషాలు
ఆశా వర్కర్లు లేని చోట అంగన్‌వాడీలు, వీరు లేని చోట పట్టణాల్లో మెప్మా సిబ్బందితోర్వే చేయించారు. కార్యక్రమం ప్రారంభం ముందుగానే ఎంపిక చేసిన వీరి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. కానీ కార్యక్రమం(సర్వే) పూర్తయి 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశాల వివరాలు మాత్రమే సేకరించారు. మిగిలిన 47 పీహెచ్‌సీల ఆశాల వివరాలు ఇంకా తీసుకోలేదు. వీరు కూడా ఖాతా వివరాలు పంపిన తర్వాత ఒకేసారి అందరికీ ప్రోత్సాహక నగదు వేస్తామని అధికారులు భీష్మించుకుని కూర్చున్నారు. గత సంవత్సరం నవంబర్‌లోనూ ఇలాగే మొదటి విడత సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అప్పట్లో 6,198 మంది ఆశాలతో పనిచేయించుకున్నారు. కానీ వారికి ప్రోత్సాహక నగదు ఇచ్చేందుకు 8 నెలలకు పైగా సమయం తీసుకున్నారు. ఇందులో కొందరికి ఇప్పటికీ నగదు అందలేదు. ఇప్పుడు సర్వే చేసిన వారికి ఎన్ని నెలల్లో ప్రోత్సాహక నగదు వేస్తారోనని ఆశాలు వాపోతున్నారు. తమకు అందే రూ.1,050 కోసం ఆందోళన చేసి అధికారుల దృష్టిలో ఎందుకు పడాలన్న ఉద్దేశంతో వారు బయటకు రాకుండా లోలోపలే కుమిలిపోతున్నారు. ప్రస్తుతం బ్యాంకు వివరాలు అందించిన వారికి నగదు వేస్తే ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అందరి ఖాతా వివరాలుఅందాలి
జిల్లాలోని ఆశాల బ్యాంకు వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 40 పీహెచ్‌సీల ఆశాల వివరాలు మాత్రమే అందాయి. మిగిలిన వారి వివరాలు అందిన వెంటనే ప్రోత్సాహక నగదు వారి ఖాతాల్లో వేస్తాము.– రామ్మోహన్,డీపీఎంఓ, లెప్రసి కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment