సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వం అధికారికంగా కల్పించిన ప్రొటోకాల్‌ను అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అభాసుపాల్జేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నా ఉన్నతాధికారులు కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో ప్రజల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు 19 మంది, లోక్‌సభ సభ్యులు నలుగురు, పరోక్ష పద్ధతిలో శాసనమండలికి ఎన్నికైన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఇటీవల తరచూ ప్రొటోకాల్ అమలు విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీలు తమ అభీష్టం మేరకు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అధికారులకు తెలియజేస్తారు.
ఉదాహరణకు జిల్లాలో టీడీపీకి తుని నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం నుంచి బొడ్డు భాస్కర రామారావు, కొత్తపేటలో రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమహేంద్రవరం నుంచి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరు అధికారిక కార్యక్రమాల్లో ప్రాతినిధ్యానికి సొంత నియోజకవర్గాలనే ఎంపిక చేసుకున్నారు.
వారికి ఆయా నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాల సమాచారం తెలియజేయడం, ఆహ్వాన పత్రాల్లో వారి పేర్లు ముద్రించడం, వేదికలపై తొలుత ఆహ్వానించడం వంటివి ప్రొటోకాల్ కిందకు వస్తాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకూ ప్రొటోకాల్ ఉంటుంది. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగమే ఉంది. ప్రొటోకాల్ అమలు విషయంలో అందరినీ ఒకేలా చూడాల్సిన నైతిక బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. కానీ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో అలా జరగడంలేదు. టీడీపీ ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ నూరు శాతం అమలవుతూండగా.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలున్న నియోజకవర్గాల్లో మాత్రం ఆ నిబంధనను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.
ఉల్లంఘనలకు ఉదాహరణలెన్నో..
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుంటే ప్రొటోకాల్‌లో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారు. అదే విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్సీలుంటే అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు.
రావులపాలెంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ సందర్భంగా విపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అధికార టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కిట్ల పంపిణీ విషయంలో ఎవరు ముందనే అంశంపై వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ‘‘కొత్తపేట కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ముందంటున్నారు. బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్సీలున్న రామచంద్రపురం, రాజమహేంద్రవరంలలో ఇదే విధానం పాటిస్తున్నారా?’’ అని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రశ్నించారు. దీనికి అటు అధికారుల నుంచి కానీ, ఇటు టీడీపీ ఎమ్మెల్సీ నుంచి కానీ సరైన సమాధానం రాలేదు.
కొత్తపేట నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో ఆలమూరు మండలంలో రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేయించారు. మాజీ ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రొటోకాల్ ఉండకపోయినా.. ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారో అధికారులే చెప్పాలి. దీనిపై రావులపాలెం కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రశ్నించినా జవాబు లేదు. ఆ రెండుచోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లనే అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు.
కొత్తపేటలో టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అడుగుతున్నట్టుగానే.. రామచంద్రపురంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కే ప్రొటోకాల్ ప్రకారం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, అక్కడ ఆ పరిస్థితి లేదు. అక్కడ జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. ఇలా అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై అసలు బోస్ పేరే వేయడం లేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు కూడా చేశారు.
ఇటీవల కాపవరంలో ఆర్‌డబ్ల్యూఎస్, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు వేసిన శిలాఫలకాలపై గ్రామ కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకుల పేర్లు సైతం వేసి, ఎమ్మెల్సీ బోస్ పేరు మాత్రం లేకుండా చేశారు. రాజీవ్ గృహకల్ప ప్రారంభం, 2015 అక్టోబర్‌లో దసరా ఉత్సవాలకు దేవాదాయ శాఖ ముద్రించిన ఆహ్వాన పత్రికలు, భీమేశ్వరస్వామికి ఏటా నిర్వహించే కల్యాణ ఆహ్వానం, జనవరిలో ఆర్థిక మంత్రి యనమల బీసీ హాస్టల్ ప్రారంభించినప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో బోస్ పేరు వేయలేదు. కొన్ని సందర్భాల్లో అసలు ఆహ్వానమే ఉండటం లేదు. ‘పచ్చ’పాతానికి ఇంతకంటే నిదర్శనాలేముంటాయి?
రాజమహేంద్రవరంలో కూడా ఇదే తంతు. ఇటీవల కందుకూరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అందరికంటే ముందే వెళ్లారు. ఆ సమావేశానికి రావాల్సిన అక్కడి టీడీపీ మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆలస్యంగా వచ్చారు. అప్పటివరకూ వేదిక సమీపాన మరో గదిలో నిరీక్షిస్తున్న ఎమ్మెల్సీని పట్టించుకోకుండా ఎమ్మెల్యే వచ్చీరాగానే కార్యక్రమం నిర్వహించేశారు. దీనిపై ఎమ్మెల్సీ అప్పారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంపచోడవరంలో విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని సైతం కాదని, జన్మభూమి కమిటీ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులు కూడా వారికే పెద్దపీట వేస్తున్నారు.
కాకినాడ రూరల్‌లో టీడీపీకే చెందిన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఉన్నా.. ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో.. అందుకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారో ప్రశ్నార్థకమే.
ఇలా చాలాసార్లు ప్రొటోకాల్ విషయంలో ‘పచ్చ’ పాతం చూపిస్తున్నా జిల్లా అధికారులు కిమ్మనడంలేదు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఇకనైనా ఇటువంటి వైఖరికి స్వస్తి చెప్పాల్సి ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రొటోకాల్‌పై ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ కూడా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆ దిశగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలి.
ప్రొటోకాల్‌లో ‘పచ్చ’పాతం
Published Sat, Jul 2 2016 8:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement