సాక్షి, కర్నూలు: మూడో విడత రచ్చబండలో కొత్త రేషన్ కార్డుల పేరిట ప్రభుత్వం హడావుడి చేసింది. కూపన్లు అందించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. వీటిని చూసి లబ్ధిదారులు ఒకింత సంతోషపడినా.. ఆ ఆనందం మూడు రోజులు కూడా నిలవలేదు. డిసెంబర్ నెలలో వీరికి బియ్యం పంపిణీపై సందిగ్ధం నెలకొనడమే ఇందుకు కారణం. రచ్చబండ సభల్లో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ నెల వరకు చెల్లుబాటు అయ్యేలా కూపన్లను పంపిణీ చేశారు. అయితే ఈ కూపన్లకు సంబంధించి బియ్యం కోటా విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు అందకపోవడం గమనార్హం.
సాధారణంగా రేషన్ బియ్యాన్ని డీలర్లు ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోపు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకు నిమిత్తం డీలర్లు అంతకు ముందు నెలలోనే డీడీలు చెల్లించాల్సి ఉంది. అధికారులు చెప్పిన రోజుల్లోనే చౌకదుకాణాల డీలర్లు డీడీలు తీసి వారికి అందజేస్తారు. ఈ ప్రక్రియ 22వ తేదీలోపు పూర్తవుతుంది. నెలాఖరులోపు సరుకు రేషన్ దుకాణాలకు చేరుతుంది. కానీ ఈనెల 27వ తేదీ సాయంత్రం వరకు డీడీల కోసం అధికారుల నుంచి డీలర్లకు ఆదేశాలు వెళ్లలేదు. కేవలం పాత రేషన్‌కార్డులకే డీడీలు తీసి 19వ తేదీ నాటికి అందజేయాలని పౌరసరఫరాల అధికారులు డీలర్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో కొత్తగా రేషన్ కార్డు కూపన్లు పొందిన 86వేల మందికి బియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలేవీ లేకపోవడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేశారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా కొత్త కూపన్‌లకు బియ్యం కేటాయింపుపై ప్రభుత్వం మండలాల వారీగా వివరాలను కోరిందన్నారు. ఆ మేరకు నివేదిక పంపినా ప్రభుత్వం నుంచి తమకు తదుపరి ఆదేశాలు అందలేదన్నారు. అందువల్ల పాత కార్డులకు మాత్రమే డీడీలు తీయాలని డీలర్లకు సూచించామన్నారు.
రేషన్ ‘రచ్చ’
Published Thu, Nov 28 2013 6:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement
Advertisement