సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ వనరుల పంపిణీపై ఏర్పాటైన అధికారుల కమిటీ చర్చల్లో కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌టీ) ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో మద్యం ఉత్పత్తిచేసే కంపెనీలు ఎక్కువగా ఉండటంతో అక్కడే ఎక్కువగా మద్యం ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచే సీమాంధ్రకు రవాణా అవుతుంది. అయితే ఉత్పత్తి కంపెనీలు ఎక్కడ ఉన్నాయో అక్కడేప్రభుత్వం వాటి నుంచి రెండు శాతం సీఎస్‌టీ వసూలు చేస్తుంది. ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వానికి సీఎస్‌టీ జమ చేసి, సీమాంధ్రలో (వినియోగం) వ్యాట్ చెల్లిస్తాయి. దీని వల్ల తెలంగాణకు రెండు శాతం సీఎస్‌టి రూపంలో ఆదాయం రానుండగా.. మద్యం ఎక్కువగా వినియోగించే సీమాంధ్ర వినియోగదారులపై వ్యాట్‌తో పాటు తెలంగాణలో కట్టిన సీఎస్‌టి భారం కూడా పడనుంది. విభజన బిల్లులో సీఎస్‌టి చెల్లింపు, చెక్‌పోస్టుల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సీఎస్‌టీ ఉండాలా వద్దా అనే దానిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే అంతిమ నిర్ణయం తీసుకోవాలని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలా వద్దా అనేది కూడా వారే నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తొలి రెండు అంకెలతో టిన్ నెంబర్‌ను రూపొందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పన్ను బకాయిలు కేసులు వాదించడానికి ఏ ప్రభుత్వం ఖర్చుచేయాలి, కేసుల పరిష్కారమయ్యాక ఆ మొత్తాన్ని ఏ రాష్ట్రానికి దఖలు పరచాలి అనే విషయంపై కూడా స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. వీటన్నిటిపై మంగళవారం నాటికి తుది రూపం వచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
కేంద్ర పన్నుపై కానరాని పరిష్కారం
Published Mon, Mar 17 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement