అప్రమత్తతతోనే ‘తెలంగాణ’ | No Telangana bill this Parliament session | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే ‘తెలంగాణ’

Published Wed, Oct 16 2013 3:47 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

No Telangana bill this Parliament session

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  తెలంగాణ జేఏసీ కోకన్వీనర్ ఎన్.చంద్రశేఖర్ మంగళవారం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాలులో దసరా పండుగను పురస్కరించుకుని ‘అలాయ్ బలాయ్’   నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ నరేంద్ర తనయుడు ఆలె భాస్కర్, జిల్లా జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,  2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం రెండేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందన్నారు. ఈ తర్వాతే కేంద్ర కేబినెట్ తెలంగాణకు ఆమోదముద్ర వేసిందన్నారు. అయినా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుపై అక్కడి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా లాబీయింగ్ ఒత్తిడికి కేంద్రం తలొగ్గకుండా ఉండేందుకు  తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధిష్టానంపై  వత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ వచ్చేంత వరకు జేఏసీ, ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్రం వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
 
 అనుమానాలన్నీ నివృత్తి చేయాలి
 తెలంగాణ పునరుజ్జీవనంలో భాగంగా నేడు అలాయ్‌బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. ఆంధ్రా, జాతీయ కాంగ్రెస్ నాయకుల ప్రకటనలతో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. హైదరాబాద్, ఉపాధి, విద్యపై ఆంధ్రా ప్రాంత నాయకులు విపరీతమైన ప్రచారం చేస్తున్నారని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టినా టీజేఏసీ అంగీకరించదన్నారు. వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని కట్టుబడి రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 371(డి) అధికరణం ప్రకారం విభజన జరగదంటున్న సీమాంధ్రులు, ఒప్పందం మేరకే రాష్ట్రాన్ని కలిపారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని  గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌ను కలిసి తమ నివేదికను అందజేస్తామన్నారు.
 
 ఐక్యంగా ముందుకు సాగుదాం
 వివక్ష, అన్యాయం, అక్రమాలు జరగకుండా ఐక్యంగా ముందుకు వెళ్దామని దేవిప్రసాద్ పిలుపునిచ్చారు. తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, సీమాంధ్రుల అధికారం, పెత్తనం, ఆధిపత్య ఆశ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలపై స్పష్టత లేని నాయకులు కేవలం హైదరాబాద్, దాని చుట్టు ఆక్రమించిన భూములపై మాత్రమే భయాందోళనలు లేవదీస్తున్నారన్నారు. వెయ్యి మంది బిడ్డల త్యాగాలతో రాష్ట్ర ప్రకటన వెలువడిందని, బిల్లు వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయదశమి సందర్భంగా ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు అలాయ్ బలాయ్ కార్యక్రమం దోహదపడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డా.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైన అనంతరం సీమాంధ్రులు ఉద్యమాన్ని నిర్వహించిన తీరును ఆయన ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ ఈ ప్రాంత పార్టీతో పొత్తుపెట్టుకోవడాన్ని అక్కడి ప్రజలు ఎలా అంగీకరించారని ఆయన ప్రశ్నించారు. ఆనాడు సీమాంధ్ర నాయకులు మాయమాటలతో మోసగించిన చందంగానే నేడు మోసగిస్తున్నారు. సమైక్యం పేరిట సీమాంధ్రలో  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆర్టీసీ బస్సులను నిలిపివేసి కేశినేని, దివాకర్‌లు కోట్ల రూపాయలు గడించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర ఏర్పాటు వల్ల వారికి ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను తెలియజేస్తే జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ యూటీకి అవకాశాల్లేవని స్పష్టం చేశారు.  జేఏసీ పశ్చిమ కమిటీ చైర్మన్ వై.అశోక్ కుమార్, కలింగ కృష్ణకుమార్, జేఏసీ సభ్యులు బీరయ్య యాదవ్, అనంతయ్య, శ్యాంరావు, వెంకటేశం, అన్వర్, చంద్రశేఖర్, సంజీవులు, శ్రీనివాస్, జేఏసీ అంతాగౌడ్, రాములు, ఆలె భాస్కర్, వేణుగోపాల్ స్వామి, ప్రశాంత్, కల్పన, సత్యన్న, బీజేసీ నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్తలు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజేశ్వర్‌దేశ్ పాండే, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చంద్రశేఖర్, సంజీవులు, భూమి శ్రీనివాస్, అంతాగౌడ్, ప్రశాంత్, రాములు, వేణుగోపాల్‌స్వామి, చంద్రారెడ్డి, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement