వేధిస్తే.. ఊరుకోం | no tolerate ysrcp workers harassment, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వేధిస్తే.. ఊరుకోం

Published Fri, Aug 8 2014 3:27 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

పులివెందులలో కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ - Sakshi

పులివెందులలో కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్

సాక్షి, కడప: అధికారం ఉంది కదా అని.. కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం.. కావాలని కేసుల్లో ఇరికించడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని.. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటాలు చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో గురువారం ఆయన మమేకమయ్యారు. పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఉదయమే వైఎస్ జగన్ ను  కలిశారు.
 
పోలీసులతోపాటు ప్రత్యర్థులు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని.. ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరపున తాను అండగా ఉంటానని.. కార్యకర్తలకు కష్టం వచ్చిన సందర్భంలో అవసరమైతే తాను కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటానని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. కొన్ని కష్టాలైతే ఉంటాయని.. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామన్నారు. కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామన్నారు.
 
మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించండి..
చక్రాయపేట మండలంలోని కాలేటివాగు డ్యాంకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములకు న్యాయమైన పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.  చక్రాయపేట మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితోపాటు మరికొంతమంది రైతులు పులివెందులలో వైఎస్ జగన్‌ను కలిశారు.
 
వరి, వేరుసెనగ, పొద్దుతిరుగుడుతోపాటు ఇతర ఎలాంటి పంటలు వేసినా మంచి దిగుబడి వచ్చే భూములు అని.. అధికారులు ఏ మాత్రం పరిశీలన చేయకుండానే బీడు భూములు అని  చెబుతూ తక్కువ పరిహారం ఇచ్చేలా చేస్తున్నారని వారు జగన్ దృష్టికి తెచ్చారు. అక్కడ ఎకరా రూ. 8లక్షల నుంచి రూ. 10లక్షలు మార్కెట్‌విలువ ఉంటే.. కేవలం లక్ష నుంచి రూ. 1.50లక్షలు ఇవ్వాలని చూడటం ఎంతవరకు న్యాయమన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించడంతోపాటు లేఖ రాయాలని సిబ్బందిని వైఎస్ జగన్ ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే  కాన్వొకేషన్ సర్టిఫికెట్లు అందించాలని  వైఎస్ జగన్‌రెడ్డి ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పలువురు విద్యార్థులు వైఎస్ జగన్‌ను కలిసిన నేపథ్యంలో వెంటనే డెరైక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
 
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, నేతలు
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్‌కుమార్, రిమ్స్ సురేష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి  తదితరులు కలిసి చర్చించారు. జిల్లా రాజకీయాలతోపాటు అనేక విషయాలకు సంబంధించి వారు చర్చించారు.
 
మున్సిపల్ కౌన్సిలర్లతో చర్చించిన వైఎస్ జగన్
పులివెందుల  మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మలతోపాటు 23మంది వార్డు కౌన్సిలర్లతో వైఎస్ జగన్ చర్చించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ పులివెందులగా మార్చేందుకు ప్రతి వీధిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించాలని వారికి సూచించారు.
 
ప్రజలతో మమేకం..
హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారు జామున ముద్దనూరులో దిగిన వైఎస్ జగన్ నేరుగా పులివెందులకు చేరుకుని  ఉదయం నుంచే ప్రజలతో మమేకమయ్యారు. ఇంట్లో ఉన్న వైఎస్ జగన్‌ను పలువురు నేతలు, కార్యకర్తలు కలిశారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి  వినతులు స్వీకరించారు.
 
వికలాంగులు, వృద్ధులు, ఉద్యోగం కోసం నిరుద్యోగులు, గ్రామాల్లో సమస్యల పరిష్కారం నిమిత్తం నాయకులు, ఇలా వచ్చిన ప్రతి ఒక్కరితోనూ వైఎస్ జగన్ మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యలో భోజన విరామం మినహా కార్యాలయంలోనే ఉండి ప్రతి ఒక్కరి సమస్య వినడం.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు.

తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి, వేముల పరిశీలకుడు వేల్పుల రాము, పులివెందుల, వేంపల్లె మండలాల కన్వీనర్లు శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.రాజారెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్.జనార్థన్‌రెడ్డి, సింహాద్రిపురం నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, లింగాల, తొండూరు, చక్రాయపేట, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వచ్చి జగన్‌ను కలుసుకున్నారు. అనంతరం పారిశ్రామిక వేత్త ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement