ఇసుక కొనలేం.. ఇల్లు కట్టలేం | nobody is able to buy sand... no hopes on own house | Sakshi
Sakshi News home page

ఇసుక కొనలేం.. ఇల్లు కట్టలేం

Published Sun, Feb 1 2015 9:54 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

nobody is able to buy sand... no hopes on own house

- బెంబేలెత్తిపోతున్న సామాన్యుడు
- యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటుతున్న ఇసుక లోడ్లు
- ప్రభుత్వం గుర్తించి తవ్వకాలు సాగిస్తోంది మూడు రీచుల్లోనే..
- టీడీపీ నేతల గుప్పిట్లో పదుల సంఖ్యలో రీచులు

 
అనంతపురం అర్బన్:  టీడీపీ ప్రభుత్వ ఆలోచనతో జిల్లాలో ఇసుక బంగారం అయిపోయింది. జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది మూడు ఇసుక రీచులైతే టీడీపీ నేతలు అనధికారికంగా పదుల సంఖ్యలో ఇసుక రీచులను కొల్లగొడుతున్నారు. రాయల్టీ పేరుతో ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపింది. ఇసుక మాఫియూ వ్యవహారమంతా అధికార పార్టీ నాయకుల అండదండలతో నడుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ అధీనంలో ఉన్న ఉలికల్లు, చిన్న ఏకలూరు, చిన్న చిగుల్ల రేవు గ్రామాల పరిధిలో ఉన్న ఈ మూడు రీచుల నుండి ప్రభుత్వం జిల్లాలో వినియోగదారులకు ఇసుక సరఫరా చేస్తోంది. వీటి ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు 36,400 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2 కోట్ల 69 లక్షలు ఆదాయం లభించింది. అయితే కొన్ని ప్రాంతాలకు ఈ మూడు రీచుల నుండి రవాణా చేయడం ఇబ్బందికరంగా మారింది. సుమారు 100 నుండి 140 కిలోమీటర్లు దూర మున్న ప్రాంతాలకు జిల్లాలో ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడడంతో పాటు ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఇసుకను రవాణా చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ ఇసుక రీచులు ఉన్నాయో గుర్తించి వాటి ద్వారా ఇసుకను సరఫరా చేయాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇసుక రీచులు పదుల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సగటున ప్రతి మండలంలోనూ ఒక ఎకరాలో ఇసుక రీచు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

సరిహద్దులు దాటుతున్న ఇసుక
మూడు మాసాల్లోనే జిల్లాలో ఉన్న మూడు ఇసుక రీచుల ద్వారా ప్రభుత్వానికి రూ. 2 కోట్ల 69 లక్షలు ఆదాయం వచ్చింది. ఇసుక మాఫియా ఆదాయం ఇంతకు నాలుగు రెట్లు ఉన్నట్లు సమాచారం. ఇసుక రవాణా సక్రమంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ, అధికార పార్టీ నాయకులు మాత్రం కనిపించిన ఇసుక కనిపించినట్లు తవ్వి తరలిస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక వ్యాపారులుగా అవతారం ఎత్తి భారీగా దండుకోవడం గమనించిన మిగతా నేతలు సైతం అదే బాటలో వెళ్తున్నారు. ఫిబ్రవరి మాసంలో జిల్లా నుంచి మరింతగా ఇసుకను తరలించడానికి ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ అనుచర వర్గంతో ఇసుక రీచులను గుర్తించారు. ఇందుకు ప్రభుత్వ అధికారులు పలువురు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అనేక రీచులు ఉన్నప్పటికి కేవలం మూడు ఇసుక రీచుల ద్వారానే ప్రభుత్వం ఇసుకను విక్రయించడం అనుమానాలకు తావిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల కోసం మిగతా వాటిని ఒదిలేశారని అధికార వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

70కు పైగా ఇసుక రీచులు!
జిల్లాలో సుమారు 70కి పైగా ఇసుక రీచులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటన్నింటిని గుర్తించి వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి మొదటి వారంలో రాప్తాడు సమీపంలో ఉన్న మరో రీచు ద్వారా ఇసుకను తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ధర రూ. 4,200 ఉండడంతో సామాన్యులు సొంతింటి నిర్మాణానికి దూరమవుతున్నారు. ఇది పరిశీలించిన ప్రభుత్వం ట్రాక్టరు రూ. 2000 నుండి 2,500 లోపు ఇసుక రవాణా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది. జిల్లాలో ఉన్న అన్ని ఇసుక రీచులను గుర్తించి వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుకను అందించడానికి చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఓ సీహెచ్ హేమసాగర్ తెలిపారు.

ఇప్పటికే రాప్తాడు సమీపంలో ఉన్న ఇసుక రీచును గుర్తించామన్నారు. జిల్లాలో ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా ద్వారా రోజుకు రూ.10 లక్షల ఆదాయాన్ని దండుకుంటున్నారని తెలుస్తోంది. పెన్నా నది పరివాహక ప్రాంతాలు, కళ్యాణదుర్గం, గోరంట్ల, ధర్మవరం ప్రాంతాల నుండి అనుమతి లేకుండా ప్రతి రోజు వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ఓ వైపు పోలీసు, మరోవైపు విజిలెన్స్, ఇంకోవైపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ‘ఇసుక ధర అమాంతం పెరగడంతో కొనలేక మూడు నెలలుగా ఇంటి పని ఆపేశా. ఇలాగైతే నా ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో.. నాలాగ వేలాది మంది పేదోళ్లు ఇంటి పని ఆపేశా’నని  అనంతపురం  శివారుకు చెందిన సుబ్బరాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement