ఏదీ ఉపాధి ‘హామీ’? | None of employment 'guarantee'? | Sakshi
Sakshi News home page

ఏదీ ఉపాధి ‘హామీ’?

Published Fri, Jan 23 2015 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఏదీ ఉపాధి ‘హామీ’?

ఏదీ ఉపాధి ‘హామీ’?

ఈ ఏడాది పనిదినాలు కేవలం 42 రోజులే  ఏపీలో సగం కుటుంబాలకూ దక్కని కూలీ
 
కర్నూలు: ఇంటిల్లిపాదీ కూలి పనులకు వెళితే కానీ కుటుంబం కడుపు నిండని నిరుపేద కుటుంబాలు అవి. ఉన్న ఊర్లో పనులు అంతంత మాత్రమే కావడంతో పనులు వెదుక్కుంటూ వలస వెళ్లక తప్పని దుస్థితి వారిది. వారి కోసం ఉన్న ఊర్లోనే పని చూపిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ఏడాదికి కనీసం వంద రోజుల పనికల్పిస్తామని, కనీస రోజు కూలీ 169 రూపాయలుగా నిర్ణయించి చట్టం చేసి మరీ అమలు చేస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చాక నిరుపేద కూలి కుటుంబాలు పనుల కోసం వలస వెళ్లే కష్టాలు కాస్తంతైనా తగ్గాయి. కానీ.. గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కూలీలకు కల్పిస్తున్న పనులు ఏటికేడూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది అది మరింతగా క్షీణించిపోయింది.  ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్ష పేద కూలీ కుటుంబాల దయనీయ స్థితి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కల్పించిన సగటు ఉపాధి దినాలు కేవలం 42 రోజులు మాత్రమే. వాస్తవానికి చట్టం ప్రకారం ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉంది. చట్టం మేరకు వీరికి సగటున రోజుకు రూ. 169 కూలీ రావాల్సి ఉండగా.. వస్తోంది సగటున కేవలం రూ. 118.67 మాత్రమే.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కుటుంబానికి ఒకటి చొప్పున 81,61,321 జాబుకార్డులు ఉన్నాయి. ఇందులో నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 1,74,51,791 మంది ఉన్నారు. అయితే.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జనవరి 22 నాటికి రాష్ట్రం మొత్తం మీద 31,83,791 కుటుంబాలకు మాత్రమే ఉపాధి కల్పించారు. నూరు రోజుల పనిదినాలకు మంగళం...

గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మొదలైన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 300 రోజులు గడచిపోయాయి. మార్చి 31వ తేదీతో ఆర్థిక ఏడాది ముగిసిపోనుంది. అంటే ఇక మిగిలివుంది నికరంగా 60 - 65 రోజులు మాత్రమే. ఇక్కడి నుంచీ ప్రతి రోజూ పని కల్పిస్తే తప్ప ఈ ఆర్థిక సంవత్సరానికి వంద రోజుల పని కల్పించాలన్న లక్ష్యం పూర్తికాదు. కానీ ఆ ప్రయత్నమే జరగడం లేదు.
 
 

Advertisement

పోల్

Advertisement