విత్తనం ఏదీ?
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాధార వ్యవసాయంలో సరైన అదనులో విత్తనం వేయడమనేది అత్యంత కీలకం. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే మెట్ట ప్రాంతాల్లో ‘పెళ్లయినా వాయిదా వేసుకుని విత్తనం వేయాలన్న’ నానుడి ప్రాచుర్యంలో ఉంది. అయితే.. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సకాలంలో రైతులకు విత్తనాలు అందించడం లేదు. ఈ విషయంలో తగినంత శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ విత్తనాల పంపిణీలో తప్పులు పునరావృతమవుతూనే ఉన్నాయి.
గత ఖరీఫ్‌లో సబ్సిడీ నిర్ణయం కాలేదన్న కారణంగా వేరుశనగ విత్తన పంపిణీని సకాలంలో చేపట్టలేదు. వర్షం వచ్చే సమయానికి విత్తనాలు సిద్ధంగా లేకపోతే కష్టమన్న ఉద్దేశంతో జిల్లా రైతులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు. అప్పటికే రైతులు విత్తనాలు సమకూర్చుకోవడంతో విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలపోయాయి. మూడు విడతల్లో 3.50 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలను పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే.. తొలివిడత మాత్రమే పంపిణీ చేసి.. 2,3 విడతలను రద్దు చేశారు. 1.26 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే అమ్ముడుపోయాయి.
వ్యవసాయ అధికారుల తీరు చూస్తుంటే ఇప్పుడు రబీలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఉంది. జిల్లాలో నల్లరేగడి భూములు కల్గిన రైతులు అక్టోబర్-నవంబర్ మాసాల్లో పప్పుశనగ వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 24 మండలాల్లోని 83 వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం అక్కడక్కడ పప్పుశనగ విత్తుతున్నారు. పదును వర్షం కురిస్తే మొత్తం వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంత వరకూ వ్యవసాయ శాఖ సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీకి సన్నాహాలే మొదలు పెట్టడం లేదు.
తెల్ల కుసుమ జాడెక్కడ?
పప్పుశనగకు మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో ఈ ఏడాది తెల్ల కుసుమ సాగును ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సమావేశాల్లో కూడా రైతులకు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే.. ఈ విత్తనం ఎక్కడ దొరుకుంది.. సబ్సిడీపై అందజేస్తారా.. లేదా అనే విషయాలు తెలియజేసే వారే కరువయ్యారు.
ఒకవేళ రెండు, మూడు రోజుల్లో పదును వర్షం వస్తే నల్లరేగడి భూముల రైతులు పప్పుశనగ, తెల్లకుసుమ, ధనియాలు తదితర పంటల సాగుకు విత్తనం కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) శ్రీరామమూర్తిని వివరణ కోరగా.. పప్పుశనగ విత్తన ధరలు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. తెల్లకుసుమ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు.