నార్మలైజేషన్‌లో ఏపీ ఎంసెట్‌ ర్యాంకులు! | normalisation in ap eamcet ranks | Sakshi
Sakshi News home page

నార్మలైజేషన్‌లో ఏపీ ఎంసెట్‌ ర్యాంకులు!

Published Fri, Mar 10 2017 3:36 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM

normalisation in ap eamcet ranks

సాక్షి, అమరావతి: ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్‌ తదితర ఉన్నత వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌లో నార్మలైజేషన్‌(సాధారణీకరణ) ప్రక్రియలో ర్యాంకులను ప్రకటించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనుండడంతో ఈ నార్మలైజేషన్‌ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ నార్మలైజేషన్‌ ప్రక్రియను ఎలా చేపట్టాలి అనే దానిపై ఉన్నత విద్యామండలి పలువురు ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో నార్మలైజేషన్‌ కమిటీని ఇంతకు ముందు నియమించింది.

గురువారం ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక చర్చలు జరిపింది. ఈ సారి కంప్యూటరాధారిత పరీక్షను వివిధ సెషన్ల కింద పెడుతున్నందున అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. అయితే ఒక సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గరిష్ట మార్కులు 80 వస్తే మరో సెషన్లో పరీక్ష రాసిన వారికి గరిష్ట మార్కులు 100 వరకు ఉండవచ్చు. ఇలా అన్ని సెషన్లలోనూ గరిష్ట మార్కులు వేర్వేరుగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా.. ఎంసెట్‌ మార్కులకు ఇంటర్మీడియెట్‌ వెయిటేజీ మార్కులను కూడా జతచేసి జేఈఈ, గేట్‌ తరహాలో నార్మలైజేషన్‌ ద్వారా ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇందుకు సంబంధించిన ఫార్ములాపై చర్చలు జరుపుతున్నారు. ఈనెల 27న నార్మలైజేషన్‌ కమిటీ మరోసారి సమావేశం కానుంది. అప్పటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా ఇప్పటివరకు ఏపీ ఎంసెట్‌కు మొత్తం 1,58,912 దరఖాస్తులు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement