
మున్సిపోల్స్‌లో ‘నోటా’ లేనట్లే!
అమలు చేయాలంటే చ ట్టం మార్చాల్సిందేనన్న న్యాయశాఖ
పురపాలకశాఖ ఫైలును తిప్పి పంపిన అధికారులు
ముస్లింలలోని 14 కులాలు బీసీ రిజర్వేషన్ కింద పోటీకి అర్హులే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో... వారెవరికీ ఓటు వేయుడం లేదని పేర్కొనే ‘నోటా’ బటన్‌ను ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యపడేలా కనిపించడం లేదు. మున్సిపోల్స్‌లో ‘నోటా’ను అమలుచేయాలంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై పురపాలక శాఖ అధికారులు ఫైలు సిద్ధం చేసినప్పటికీ.. ప్రస్తుతం ‘నోటా’ అమలు చేయడం కుదరదని న్యాయశాఖ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, పురపాలక సంఘాల చట్టాలను సవరిస్తే తప్ప ‘నోటా’ను అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. ఈ మేరకు ఫైలును పురపాలక శాఖకు తిప్పి పంపింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ అయినందున.. ఇప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చట్టానికి సవరణలు చేయడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో మున్సిపోల్స్‌లో ‘నోటా’ లేనట్లే.
ఎమ్మెల్యేలకు ఓటు హక్కుపై..
రాష్ట్ర శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నందున మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక సమయంలో శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినట్లు సమాచారం. దీనిపై న్యాయపరమైన అభిప్రాయం కోరుతూ పురపాలక శాఖ న్యాయశాఖకు ఫైలు పంపించింది.
ముస్లింలలోని 14 కులాలు బీసీలే...
మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల్లోని 14 ఉప కులాలను బీసీలుగా గుర్తిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వారు కూడా ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కింద పోటీ చేయవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారు లు మాత్రం దీనిపై ఒక వివరణ ఇవ్వాలని కోరుతూ.. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలుగా గుర్తించిన కులాలు.. అచ్చుకండ్లవాళ్లు, అత్తరుసాయబులు/అత్తరోళ్లు, దోబీ ముస్లిం, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం/ఫకీర్ సాయబులు, ఎలుగుబంటువాళ్లు, హాజం, లబ్బి, పకీర్ల, ఖురేషి, షేక్, సిద్ది, తురుక కాషా కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. ఈ కులాల పేర్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉచ్చరిస్తున్నందున వాటిని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్ మిట్టల్ 22 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారికి ఆదేశించారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాప్‌ల మూసివేత.. వాహనాల తనిఖీ, అనధికారికంగా తరలిస్తున్న డబ్బును సీజ్ చేయడం, నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, ఓటర్లకు పోలింగ్ తేదీకి ముందే స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై తగిన సూచనలు ఇచ్చారు.