అడుగడుగునా మేత | Notices to the building owners | Sakshi
Sakshi News home page

అడుగడుగునా మేత

Published Sun, Apr 10 2016 12:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Notices to the building owners

టార్గెట్ రూ.2 కోట్లు
భవన నిర్మాణదారులకు నోటీసులు
అభివృద్ధి కమిటీ పేరు గిమ్మిక్కు


అధికార పార్టీ అండలో అక్రమాల దందాతో పెనమలూరు నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెర తీశాడు. యనమలకుదురులో అక్రమ కట్టడాలను లక్ష్యంగా  చేసుకున్న ఆ మేతల నేత గతంలో రూ.1.5 కోట్లు దండుకున్నాడు. తాజాగా మరో రూ.2 కోట్లకు దోపిడీకి తెర తీశాడు. 50 అక్రమ కట్టడాల నుంచి రూ.5 లక్షలకు తగ్గకుండా దండుకునేందుకు పక్కాగా స్కెచ్ గీశాడు. స్మార్ట్ విలేజీ పేరిట ఈ మొత్తం స్వాహాకు రంగం సిద్ధం చేశాడు.

 

 పెనమలూరు : యనమలకుదురులో మరోసారి అక్రమ వసూళ్లకు తెరలేచింది. స్మార్ట్ గ్రామం అభివృద్ధి కమిటీ ముసుగులో నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఈ దందాకు సిద్ధమయ్యారు. ఏకంగా రూ.2 కోట్ల వసూళ్లు టార్గెట్‌గా రంగం సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా పంచాయతీ కార్యదర్శితో అక్రమ కట్టడాలకునోటీసులు జారీ చేయించటం మొదలుపెట్టారు.

 
పంచాయతీ  ఆదాయానికి గండి...

యనమలకుదురులో కొందరు బిల్డర్లు అక్రమ కట్టడాలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎటువంటి ప్లాన్లూ ఇవ్వకుండానే నకిలీ ప్లాన్‌లతో గ్రూప్ హౌస్‌లు, అనేక అక్రమ కట్టడాలను నిర్మించారు. ఈ వ్యవహారంపై ఆధారాలు సహా ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. పంచాయతీ ఆదాయానికి దాదాపు అర కోటి రూపాయలకు పైగా గండి కొట్టిన వైనాన్ని బహిర్గతం చేసింది. దీనిపై గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అక్రమంగా ప్లాన్లు ఇచ్చారంటూ గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.

 
మొదటికి వచ్చిన వసూళ్లు

గతంలో టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అక్రమ కట్టడాలపై కన్నేసి సీఆర్‌డీఏ, విజిలెన్స్, జిల్లా పంచాయతీ అధికారులను అడ్డు పెట్టుకుని దాదాపు రూ.కోటిన్నర వసూళ్లకు పాల్పడ్డారు. ఇది కప్పిపుచ్చుకోవటానికి కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలించి గ్రామంలో అక్కడక్కడ ఇసుకతో రోడ్లు వేసి తాను గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొని బాకా కొట్టుకున్నారు. గట్టిగా ఒక వాన పడితే నిలవని స్థాయిలో వీటి నాణ్యత ఉండటం గమనార్హం. ఇప్పుడు గ్రామంలో దాదాపు 50 అక్రమ కట్టడాలను గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్లుకు పైగా వసూళ్లకు టీడీపీ నేత రంగం సిద్ధం చేశారు. గతంలోలా వసూళ్ల వ్యవహారం అల్లరి అవకుండా ఇప్పుడు పంథా మార్చారు. స్మార్టు గ్రామం అభివృద్ధి కమిటీ పేరుతో బిల్డర్లను ఒక్కో గ్రూప్‌హౌస్‌కు రూ.5 లక్షలు చొప్పున 50 నిర్మాణాలకు టార్గెట్ రూ.2 కోట్లకు పైగా పెట్టారు. అధికారులను రంగంలోకి దించి నోటీసులు ఇప్పించే పనిలో పడ్డారు. ఒక కమిటీ కూడా వేసి డీడీలు తీయించే పనిలో టీడీపీ నేత ఉన్నారు.

 
అక్రమ ప్లాన్‌లపై కేసులేవీ?

అక్రమ ప్లాన్‌లతో నిర్మాణాలు చేస్తున్న వారిపై ఇప్పటివరకు క్రిమినల్ కేసులు పెట్టలేదు. టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో అధికారులెవరూ చర్యలకు సాహసం చేయలేదు. పంచాయతీ కార్యాయలంలో ముద్రలు వాడి, పంచాయతీ ఆదాయానికి గండి కొట్టి, బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన వారిని వదిలేశారు. పైగా టీడీపీ నేత ఆదేశాలతో అధికారులే ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్లుగా మారారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోనే ఈ తరహా మోసం ఎక్కడా జరగదని చెబుతున్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ దందా, వసూళ్లు జరుగుతున్నా ఉన్నతాధికారులు కన్నెత్తి కూడా చూడకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులే కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు.


కమిటీతో తస్మాత్ జాగ్రత్త
టీడీపీ నేత వేసిన కమిటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమిటీ పగ్గాలు తీసుకునేవారు ఈ అక్రమ వసూళ్లకు జవాబుదారీగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వారు చట్టపరిధిలో ఇరుక్కుపోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement