మీ ఫొటోతో తపాలా బిళ్ల!
సాక్షి, హైదరాబాద్: ఇక మీదట మీ ఫొటోతో ఉన్న తపాలా బిళ్లలను అతికించి ఉత్తరాలను మీ సన్నిహితులకు పంపుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇప్పటివరకు మహనీయులు, చారిత్రక ఘట్టాలు ఇలా ఎన్నో ఇతివృత్తాల నేపథ్యంగా అందుబాటులో ఉన్న తపాలా బిళ్లపై ఏకంగా ఎవరి ఫొటోనైనా ముద్రించుకునే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే ‘మై స్టాంప్’ కార్యక్రమం. వినూత్నమైన ఈ విధానానికి తపాలాశాఖ తాజాగా శ్రీకారం చుట్టింది. ఉత్తరాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాసే పద్ధతి అంతరించపోకుండా చేసేందుకే తపాలాశాఖ ఈ వినూత్న ఆలోచన చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లాంటి సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవటంతో ఉత్తరం ‘చిరునామా’ గల్లంతవుతూ వస్తోంది. అనతికాలంలోనే పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే దుస్థితీ వచ్చింది. ఈ క్రమంలో తపాలాశాఖ ‘మై స్టాంప్’ కార్యక్రమంతో ‘ఉత్తరం’కు మళ్లీ ప్రాణం పోసేందుకు నడుంబిగించింది.
ప్రైవేటు సంస్థలకూ అవకాశం: ప్రైవేటు సంస్థలు సైతం తమ సంస్థ లోగోతో స్టాంపులు రూపొందించుకునేందుకూ తపాలా అధికారులు అవకాశం కల్పించారు. ఏవేని ముఖ్యస్థలాలు, చారిత్రక ప్రాంతాలతోనూ సంస్థలు స్టాంపులు రూపొందించుకోచ్చు. అయితే ఆయా స్థలాలపై ఎలాంటి కాపీరైట్ ఉండరాదని నిబంధన విధించారు. వాటి యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలను తెచ్చినా అంగీకరిస్తామని తపాలా అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా సంస్థలు కచ్చితంగా 500 షీట్ల(ఒక్కోటి 12 స్టాంపులతో)కు తక్కువ కాకుండా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 20 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తపాలా శాఖ ఈ ప్రయత్నం ఏమేరకు సఫలమవుతుందో వేచిచూడాలి.
ఇలా చేయాలి...
తన చిత్రంతో తపాలాబిళ్ల కావాలనుకునేవారు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లాలి. గుర్తింపు కార్డుతోపాటు ఫొటోను ఇవ్వాలి. ఫొటో లేకపోయినా ఫర్వాలేదు. సిబ్బందే కెమెరా ద్వారా ఫొటో సేకరిస్తారు. దానిని జతచేస్తూ దరఖాస్తుపత్రాన్ని నింపి ఇవ్వాలి. 4 డిజైన్లలో ఉండే స్టాంపుల్లో కోరినదానిని గుర్తిస్తే.. అదే నమూనాలో వారి ఫొటోలతో సిబ్బంది స్టాంపులు తయారు చేసిస్తారు. ఒక్కో స్టాంపు విలువ రూ.5గా ఉంటుంది. అలాంటివి 12 స్టాంపులుండే షీటును కచ్చితంగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీనికి అన్ని ఖర్చులు కలిపి రూ.300గా ధరను నిర్ణయించారు. ఈ స్టాంపులను బట్వాడా కవర్‌పై అతికించి పోస్ట్ చేసుకోవచ్చు. అంటే.. ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు తరహాలోనే ఇది పనిచేస్తుందన్న మాట. స్నేహితులకు లేఖలు, గ్రీటింగ్‌కార్డులు పంపేప్పుడు ఈ స్టాంపులను అతికించుకుని.. తన ఫొటోతో ఉన్న స్టాంపును వినియోగించుకుని ఓ మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు.