నిట్టూ.. ర్పే! | Now sections of the Central Intelligence Agency a false report, 'infinite' from the ANIT | Sakshi
Sakshi News home page

నిట్టూ.. ర్పే!

Published Sat, Nov 9 2013 3:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Now sections of the Central Intelligence Agency a false report, 'infinite' from the ANIT

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’ సిగలో నుంచి ఒక్కో కలికితురాయి చేజారిపోతోంది. నాడు కిరణ్ సర్కారు నిర్లక్ష్యం వల్ల ప్రతిష్ఠాత్మక ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్) రెండో క్యాంపస్ జిల్లా నుంచి కర్ణాటక తన్నుకెళితే.. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాల(ఐబీ) తప్పుడు నివేదిక ‘అనంత’ నుంచి ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) మరో ప్రాంతానికి తరలిపోయేలా చేస్తోంది. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఎన్‌ఐటీని నెలకొల్పడానికి జిల్లా అనుకూలం కాదని కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నివేదిక వల్లే ఎన్‌ఐటీని ‘అనంత’లో స్థాపించే అంశంపై కేంద్రం పునరాలోచన చేస్తోన్నట్లు అధికారవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
 
 వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని యూపీఏ పక్షాలు రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జూలై 29న మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘అనంత’ కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు జిల్లాలోని జేఎన్‌టీయూ(జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం)ను ఎన్‌ఐటీగా అభివృద్ధి చేయడానికి 24 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని వర్తమానం పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క వరంగల్‌లో మాత్రమే ఎన్‌ఐటీ కేంద్రం ఉన్న విషయం విదితమే. ఈ అంశాన్ని జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ లాల్‌కిషోర్, రిజిష్ట్రార్ హేమచంద్రారెడ్డికి వివరించిన కలెక్టర్.. తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు జేఎన్‌టీయూ, ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఓటీఆర్‌ఐ(తైల సాంకేతిక పరిశోధన సంస్థ) అధికారులతో వైస్ చాన్స్‌లర్ లాల్‌కిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 జేఎన్‌టీయూను ఎన్‌ఐటీగా అభివృద్ధి చేయడానికి రూ.400 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న ఓటీఆర్‌ఐని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ) సంస్థ స్థాయిలో జాతీయ పరిశోధన సంస్థగా తీర్చిదిద్దేందుకు రూ.వంద కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రెండు ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా జూలై 30న కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖకు పంపారు. అదే రోజున సాయంత్రం రాష్ట్ర విభజనపై యూపీఏ పక్షాలు, సీడబ్ల్యూసీ ప్రకటన చేశాయి.
 
 ఐఐఎస్‌సీకి కిరణ్ సర్కారు దెబ్బ..
 వర్షాభావ ప్రాంతమైన ‘అనంత’లో విద్యారంగాన్ని పటిష్ఠం చేస్తే కరువు బారి నుంచి ప్రజలను రక్షించవచ్చునని కేంద్రం యోచించింది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తూ 2010 ఏప్రిల్ 25న అప్పటి కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకు చిలమత్తూరు మండల పరిధిలో ఎన్‌హెచ్-44కు సమీపంలో ఉన్న 1,400 ఎకరాల భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఐఐఎస్‌సీకి వర్తమానం పంపింది. ఈ భూమిని పరిశీలించిన ఐఐఎస్‌సీ బృందం.. అక్కడ రెండో క్యాంపస్ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖకు నివేదించింది. తక్షణమే భూమిని అప్పగిస్తే.. 2012 విద్యా సంవత్సరం నాటికి ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను ఏర్పాటుచేసి, తరగతులు ప్రారంభిస్తామని ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంది.
 
 కానీ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కనీసం భూమిని కూడా ఆ సంస్థకు అప్పగించలేదు. ఇదే అదనుగా తీసుకున్న కర్ణాటక సర్కారు బెంగళూరులోని ఐఐఎస్‌సీ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. చిత్రదుర్గ జిల్లాలో ఉచితంగా భూమిని కేటాయించడంతోపాటూ భవనాలు, మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని, రెండో క్యాంపస్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయాలని కర్ణాటక సర్కారు ఐఐఎస్‌సీ యాజమాన్యాన్ని కోరింది. మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిన ఐఐఎస్‌సీ యాజమాన్యం రెండో క్యాంపస్‌ను చిత్రదుర్గలో ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కేంద్రాన్ని తప్పుదోవ పట్టించిన ఐబీ..
 రాష్ట్ర విభజనపై యూపీఏ పక్షాలు, సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే ‘అనంత’ నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకుని.. సీమాంధ్రకు దావానంలా వ్యాపించిన విషయం విదితమే. ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా.. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు.
 
 జిల్లాలో జేఎన్‌టీయూను ఎన్‌ఐటీగా అభివృద్ధి చేసేందుకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐబీ వర్గాల ద్వారా ఆరా తీసింది. జిల్లాలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకుపోయిందని.. నక్సలిజం ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని ఐబీ వర్గాలు కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చాయి. శాంతి భద్రతలు జిల్లాలో పూర్తి స్థాయిలో అదుపులో లేవని ఆ నివేదికలో పేర్కొంది. ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను ఏర్పాటు చేయడానికి జిల్లా అనుకూలం కాదని స్పష్టీకరిస్తూ కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నివేదికతో జేఎన్‌టీయూను ఎన్‌ఐటీగా మార్చే ప్రతిపాదనపై కేంద్రం పునరాలోచనలో పడింది. జిల్లాలో కాకుండా మరో ప్రాంతంలో ఎన్‌ఐటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐబీ వర్గాల తప్పుడు నివేదిక వల్ల ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను దుర్భిక్ష ‘అనంత’ కోల్పోవాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement