బాలరాజా..టైమ్ లేదా? | Now .. time or not? | Sakshi
Sakshi News home page

బాలరాజా..టైమ్ లేదా?

Published Tue, Jan 21 2014 2:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

బాలరాజా..టైమ్ లేదా? - Sakshi

బాలరాజా..టైమ్ లేదా?

  • పాడేరులో ప్రారంభం కాని ఏడో విడత భూ పంపిణీ
  •  ఇప్పటికీ జరగని అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ సమావేశం
  •  8 నియోజకవర్గాల్లో గత నెల 30నే పూర్తి
  •  ఆ విషయమే ఆలోచించని గిరిజన మంత్రి
  •  
     విశాఖ రూరల్, న్యూస్‌లైన్:  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజుకు గిరిపుత్రుల సంక్షేమం పట్టడం లేదు. ప్రొటోకాల్  అమలులో ఏ చిన్న తేడా జరిగినా ఒంటి కాలిపై లేచే మంత్రి.. గిరిజన రైతులకు ‘హక్కు’లు కల్పించే విషయాన్ని మాత్రం గాలికొదిలేశారు. అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న పేద గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జిల్లాలో 8 ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తయినా.. మంత్రి నియోజకవర్గమైన పాడేరులో మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

    గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందలేదు. అసలు అసైన్‌మెంట్ కమిటీ సమావేశమే నిర్వహించకపోవడం గమనార్హం. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉండడంతో అప్పటి లోగా తమకు పట్టాలు అందుతాయో లేదోనని 290 మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. భూపంపిణీ ఏడో విడతలో భాగంగా కేవలం తొమ్మిది నియోజకవర్గాల్లో గల 23 మండలాల్లో మాత్రమే పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
     
    అధికారులకు తలనొప్పి
     
    మంత్రి బాలరాజు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. చెప్పకపోతే చెప్పలేదని అలుగుతారు. చెప్పినా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దోమ తెరల పంపిణీ విషయంలో తనకు చెప్పకుండా గిరిజనులకు అందించారంటూ మంత్రి బాలరాజు అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా భూ పంపిణీ విషయంపై స్వయంగా అధికారులే ఆహ్వానాలను మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు, మంత్రి బాలరాజుకు ఇళ్లకు వెళ్లి మరీ అందించారు. అయినా ఫలితం లేదు.
     
    ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదింటిలో 5129.53 ఎకరాలను 4137 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
     
    ఏడో విడతలో పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాల్లో 1903.59 ఎకరాలను, 891 మంది లబ్ధిదారులను గుర్తించారు.
     
    పాడేరు మినహా అన్ని నియోజకవర్గాల్లో అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ సమావేశాలు ముగిశాయి.
     
    గత నెల 30న భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
     
    పాడేరు నియోజకవర్గానికి సంబంధించి అసైన్‌మెంట్ కమిటీకి చైర్మన్ అయిన మంత్రి బాలరాజు ఇప్పటి వరకు ఆ సమావేశాన్నే నిర్వహించలేదు.
     
    అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించకపోయినా, లబ్ధిదారుల జాబితాపై సంతకం చేస్తే గిరిజన రైతులకు హక్కుపత్రాలను ఇస్తామని అధికారులు మంత్రికి విన్నవించినా ఫలితం లేదు.
     
    ఆరో విడత భూ పంపిణీ సమయంలో కూడా మంత్రి అసైన్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. అయినప్పటికీ అధికారులు భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
     
    ఈసారి అలా చేస్తే మంత్రి మళ్లీ అలిగి ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తారేమోనని అధికారులు బాలరాజు అనుమతి కోసం వేచి చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement