సాక్షి, గుంటూరు: ఎన్టీఆర్ వైద్య సేవలు ఆలస్యం అమృతం.. విషం అన్న చందంగా మారాయి.పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లను పేదలకు ఉచితంగా చేయించి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య పథకానికి అనారోగ్యం వచ్చింది. గతంలో ఉన్న పేరును మార్చి ఎన్టీఆర్ వైద్యసేవగా నామకరణం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే నాలుగు రోజులకుపైగా పడుతోంది.
దీంతో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు సకాలంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేయటంతో జీజీహెచ్ లాంటి పెద్దాస్పత్రి మొదలుకొని పలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సైతం ఆపరేషన్లు నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు జరగాలంటే రోజుల తరబడి ఆస్పత్రుల్లో మంచాలపై మూలగాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అనుమతులు రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోందని, మరోవైపు ట్రస్టు అనుమతి ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తే డబ్బులు మంజూరు కావడం లేదని ఆస్పత్రుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా వెంటనే అనుమతులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు వైద్యులు కోరుతున్నారు.
పథకంలో పలు మార్పులు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి ఎన్నో మార్పులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం 2007వ సంవత్సరంలో ప్రారంభం కాగా గుంటూరు జిల్లాలో 2008 జూలై 7 నుంచి ప్రారంభమైంది. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 2011లో ఆరోగ్య పథకంలో మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 126 రకాల ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసేలా మార్పులు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి అనుమతుల మంజూరులో మాత్రం కోతలు విధించింది.
వెరిఫికేషన్ ఆలస్యం అవుతుంది
ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఆపరేషన్లు చేసేందుకు కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. న్యూరోసర్జరీ ఆపరేషన్‌లతోపాటు మరికొన్ని ఆపరేషన్‌లకు అనుమతుల్లో జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇకమీదట ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు,ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment