
పెళ్లికాని ప్రసాదులు@ 6 లక్షలు!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివాహ బంధం కోసం ఎదురు చూస్తున్న అబ్బాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పెళ్లి కోసం కలలుగంటున్న అమ్మాయిల సంఖ్యతో పోల్చితే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉండడం అటు వారి తల్లిదండ్రులను, ఇటు సమాజాన్ని కూడా
తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
హైదరాబాద్: ‘శ్రీరస్తు.. శుభమస్తు..’ అనే పల్లవి పాడుకుంటూ పెళ్లి పుస్తకానికి శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లికాని ప్రసాదులు. వీరి సంఖ్యకు సుమారు 25 శాతం తక్కువగా అమ్మాయిలూ ఇదే పల్లవి అందుకుంటున్నారు!. మూడు పదుల వయసు దాటినా.. పెళ్లి పుస్తకం తెరవని పురుషుల సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 6 లక్షలకు పైగా చేరిందంటే.. పరిస్థితి తీవ్రత ఇట్టే అర్ధమవుతుంది. ఈ విధంగా ఏపీ, తెలంగాణల్లో పెళ్లిళ్లు కాని యువతీ యువకుల సంఖ్య పెరగడానికి.. పురుషుల సంఖ్యతో పోల్చినప్పుడు మహిళల సంఖ్య తక్కువగా ఉండడమే ప్రధాన కారణమని సర్వేలు చాటుతున్నాయి. ఇదిలావుంటే, కొన్ని వర్గాల్లో అమ్మాయిలకు ముక్కుపచ్చలారకుండానే వివాహాలు జరుగుతుండడం ఆలోచించాల్సిన విషయం.
చిట్టి‘తల్లులు’!: చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్న(తల్లిదండ్రులు చేస్తున్న) అమ్మాయిల సంఖ్య ఉభయ రాష్ట్రాల్లోనూ లక్షల సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. 15 ఏళ్ల వయసు కూడా నిండక ముందే ఇద్దరు బిడ్డలకు తల్లులవుతున్న అమ్మాయిలు ఇరు రాష్ట్రాల్లోనూ 17,400 మంది ఉన్నారు. టీనేజ్(19 ఏళ్ల లోపు) దాటక ముందే పెళ్లికూతుళ్లయిన అమ్మాయిలు 8 లక్షల మంది ఉండగా, వారిలో 1.78 లక్షల మందికి తొలికాన్పు కూడా అయిపోయింది. 2011 జనాభా లెక్కల్లోని సమాచారాన్ని విశ్లేషిస్తూ దేశం, ఏపీ, తెలంగాణల్లోని ప్రజల వైవాహిక స్థితిగతులను జన గణన శాఖ ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికాని యువకులు, యువతుల సంఖ్య కలవర పెడుతుండగా, బాల్య వివాహాలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి.
చిన్న వయసులోనే పెళ్లిపీటలెక్కుతున్నవారు..
వయసు (సం.లో) పురుషులు మహిళలు
10-14 49,315 95,912
15-19 1,25,188 8,01,013