దేవునిపల్లి, న్యూస్‌లైన్ :
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ‘అమృతం’ పంచుతోంది. మహిళా శిశుసంక్షేమ శాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో బాల అమృతం పేరిట ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే ఈ పౌడర్ ప్యాకెట్లను ఆయా కేంద్రాలకు పంపుతున్నట్లు ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు.
పదిరకాల న్యూట్రిషన్స్‌తో..
పిల్లల కోసం పది రకాల న్యూట్రిషన్స్‌తో కూడిన 2.5 కేజీల పౌడర్‌ను ప్యాకెట్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు వందగ్రాముల చొప్పున పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఈలెక్కన ఒక ప్యాకెట్ నెలరోజుల పాటు వస్తుంది. మూడేళ్లలో 36ప్యాకెట్‌లను ఒక్కో పిల్లాడికి పంపిణీ చేయాలి. గోధుమలు, శనగలు, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్‌పౌడర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సీ, బీ1, బీ2, ఫోలిక్‌యాసిడ్, నియాసిన్‌లతో ఈ పౌడర్‌ను తయారుచేస్తారు. పాప పుట్టినప్పటి నుంచి ఏడునెలల వరకు పిల్లలకు తల్లిపాలు కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఏడునెలల తర్వాత మూడేళ్ల వరకు ఈ పౌడర్‌ను అందించాలి. జిల్లాలో మొత్తం 2,410 అంగన్‌వాడీ కేంద్రాలు, అలాగే 290 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 25వేల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రతి పిల్లాడికి అందేలా..
-రాములు, పీడీ. ఐసీడీఎస్
పిల్లల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా ఉండేందుకు బాల అమృతం పథకం ప్రారంభమైంది. ఈ ప్యాకెట్లు ప్రతి పిల్లాడికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్‌వాడీ కార్యకర్తలు సర్వేలు నిర్వహించి, సక్రమంగా అందేలా చూడాలి. ఈ పథకాన్ని తల్లులు సద్వినియోగం చేసుకోవాలి.