న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2021 అక్టోబర్ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా వేసింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్ ట్రాకర్’యాప్‌లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలను నేరుగా అంగన్‌వాడీ సిబ్బంది నమోదు చేసినవి కావడం గమనార్హం. 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91% పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.
ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మొహం, పొట్ట తదితర భాగాలు ఉబ్బినట్లు ఉండటం తదితర లక్షణాల ఆధారంగా తీవ్ర, మధ్యస్త పౌష్టికాహారలోపంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. ఈ లక్షణాలున్న పిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశం ఉంది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా, వీరిలో 4.58 లక్షల మంది తీవ్రమైన, 1.57 లక్షల మంది మధ్యస్తమైన పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు గుర్తించారు.
కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని సామాజిక–ఆర్థిక సూచికలపైనా వ్యతిరేక ప్రభావం చూపిందని చైల్ రైట్స్ అండ్ యు(క్రై) సీఈవో పూజా మార్వాహ అన్నారు. గత దశాబ్ద కాలంపాటు సాధించిన పురోగతి కోవిడ్‌తో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దీర్ఘకాలంపాటు అంగన్‌వాడీ కేంద్రాలను, స్కూళ్లలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేయడం పేద బాలలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కాగా, 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment