Department of Womens sisusanksema
-
33లక్షల మంది బాలల్లో పౌష్టికాహార లోపం
న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021 అక్టోబర్ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా వేసింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్ ట్రాకర్’యాప్‌లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలను నేరుగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసినవి కావడం గమనార్హం. 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91% పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మొహం, పొట్ట తదితర భాగాలు ఉబ్బినట్లు ఉండటం తదితర లక్షణాల ఆధారంగా తీవ్ర, మధ్యస్త పౌష్టికాహారలోపంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. ఈ లక్షణాలున్న పిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశం ఉంది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా, వీరిలో 4.58 లక్షల మంది తీవ్రమైన, 1.57 లక్షల మంది మధ్యస్తమైన పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని సామాజిక–ఆర్థిక సూచికలపైనా వ్యతిరేక ప్రభావం చూపిందని చైల్ రైట్స్ అండ్ యు(క్రై) సీఈవో పూజా మార్వాహ అన్నారు. గత దశాబ్ద కాలంపాటు సాధించిన పురోగతి కోవిడ్‌తో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దీర్ఘకాలంపాటు అంగన్వాడీ కేంద్రాలను, స్కూళ్లలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేయడం పేద బాలలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కాగా, 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు. -
బాల సదనంలో చిన్నారిపై లైంగిక దాడి
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో స్త్రీ శిశుసంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదనంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి, మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాల సదనానికి వెళ్లిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు బాధిత చిన్నారులు విషయాన్ని చెప్పడంతో వారు గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాల సదనంలో పదేళ్ల వయసున్న చిన్నారులు చదువుకుంటున్నారు. వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలకు చెందిన ఎన్జీవోలు పిల్లల ఆలనాపాలనా చూడడంతో పాటు.. ఏ ప్రాంతంలోనైనా అనాథ బాలలు కనిపిస్తే తీసుకొచ్చి ఈ సదనంలో చేర్చుతారు. ఇదే తరహాలో 17వ తేదీన ‘లవ్ టూ సర్వే ఫౌండేషన్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’కు చెందిన ప్రతినిధులు ఇద్దరు అనాథ చిన్నారులను సదనంలో చేర్చేందుకు వచ్చారు. అదే సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ వచ్చి 16వ తేదీ అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని, మరో చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చెయ్యిని గట్టిగా కొరకడంతో వదిలేసి పారిపోయాడని చెప్పారు. నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదని విలపించారు. దీంతో నివ్వెరపోయిన ఎన్జీవో ప్రతినిధులు ఈ ఘటనపై బాల సదనం నిర్వాహకులను నిలదీయగా వారు ఎన్జీవో ప్రతినిధులపైనే చిర్రుబుర్రులాడారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తి పనే.. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పద్మావతి బాల సదనానికి వచ్చి అప్పటికే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల జగ్గంపేట, కాకినాడ దమ్ములపేట తదితర ప్రాంతాల్లో చిన్నారులపై జరిగిన అత్యాచార కేసుల పరిశీలన నిమిత్తం వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబులు కూడా బాలసదనం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధిత చిన్నారితో తాము మాట్లాడామని ఇది తెలిసిన వ్యక్తి పనేనని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.నాగమురళి తెలిపారు. -
బాలలకు ‘అమృతం’
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ‘అమృతం’ పంచుతోంది. మహిళా శిశుసంక్షేమ శాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో బాల అమృతం పేరిట ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందించనుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఈ పౌడర్ ప్యాకెట్లను ఆయా కేంద్రాలకు పంపుతున్నట్లు ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు. పదిరకాల న్యూట్రిషన్స్‌తో.. పిల్లల కోసం పది రకాల న్యూట్రిషన్స్‌తో కూడిన 2.5 కేజీల పౌడర్‌ను ప్యాకెట్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు వందగ్రాముల చొప్పున పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఈలెక్కన ఒక ప్యాకెట్ నెలరోజుల పాటు వస్తుంది. మూడేళ్లలో 36ప్యాకెట్లను ఒక్కో పిల్లాడికి పంపిణీ చేయాలి. గోధుమలు, శనగలు, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్‌పౌడర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సీ, బీ1, బీ2, ఫోలిక్‌యాసిడ్, నియాసిన్‌లతో ఈ పౌడర్‌ను తయారుచేస్తారు. పాప పుట్టినప్పటి నుంచి ఏడునెలల వరకు పిల్లలకు తల్లిపాలు కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఏడునెలల తర్వాత మూడేళ్ల వరకు ఈ పౌడర్‌ను అందించాలి. జిల్లాలో మొత్తం 2,410 అంగన్వాడీ కేంద్రాలు, అలాగే 290 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 25వేల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి పిల్లాడికి అందేలా.. -రాములు, పీడీ. ఐసీడీఎస్ పిల్లల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా ఉండేందుకు బాల అమృతం పథకం ప్రారంభమైంది. ఈ ప్యాకెట్లు ప్రతి పిల్లాడికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు సర్వేలు నిర్వహించి, సక్రమంగా అందేలా చూడాలి. ఈ పథకాన్ని తల్లులు సద్వినియోగం చేసుకోవాలి.