నూజివీడు ఎమ్మెల్యేకి సతీ వియోగం
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి మేకా సుజాతాదేవి (56) ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో నూజివీడులోని స్వగృహంలో కన్నుమూశారు. రోజూ వేకువజామునే నిద్రలేచే ఆమె తెల్లవారిన తరువాత కూడా లేవకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక అమెరికన్ ఆస్పత్రి వైద్యులను పిలిపించారు. వారు వచ్చి పరీక్షించి ఆమె మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌చేసి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. తన సంతాపం తెలిపారు. విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌చేసి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. తన సానుభూతి తెలిపారు.
నేడు నూజివీడుకు వై.ఎస్.జగన్
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ సోమవారం నూజివీడు వస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నూజివీడు వస్తారని చెప్పారు. సుజాతాదేవి పార్థివదేహానికి నివాళులర్పించి, ప్రతాప్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించిన తరువాత హైదరాబాద్ వెళతారని తెలిపారు.