
గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన
చాపరాయి వలస(పాచిపెంట): మండలంలోని వేటగానివలస సమీపంలో చాపరాయివలస వద్ద ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని కేంద్ర బృందం ఆదివారం పరిశీలించింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.పి.సిసోడియా, నీలం సహాని, రామ బ్రహ్మంతో కూడిన బృందం ఆదివారం ఈ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలుకు అతీతంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ గిరిజన యూనివ ర్సిటీ నిర్మాణం తప్పనిసరని స్థానికులు కమిటీకి వివరించారు. నాలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న పాచిపెంటకు అరుకు రహదారి సౌకర్యం కూడా ఉన్నందున గిరిజన యూనివర్సిటీకి అనుకూలమని గిరిజన ప్రజాప్రతినిధులు తెలిపారు. అనంత రం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి స్థలానికి సంబంధించిన మ్యాప్‌తో బృందానికి వివరించారు. ఈ ప్రాంతం అన్ని విధాలా గిరిజన యూనివర్సిటీకి అనుకూలమని కేంద్రం బృందం నిర్ధారణకొచ్చినట్లు తెలిసింది.
ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైతే ఎంతోమంది గిరిజనుల ఉన్నత చదువులకు అవకాశముం టుందని మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం భూమి వివరాలపై అధికారులు ఆరా తీశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్‌బాబు, టీడీపీ నాయకులు ముఖీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులను ఆదుకోవాలి
ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అభినందనీయమని, ఇక్కడ తరతరాలుగా జీవనోపాధి పొందుతున్న గిరిజన రైతులను ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్రకమిటీకి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సర్వే చేయక పట్టాలు మంజూరు కాలేదని చెప్పారు. దీంతో ఈ ప్రాంతం అన్ సర్వేడ్ భూమిగానే మిగిలిపోయిందని అన్నారు. ఈయనతో పాటు డివిజన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు కాడాపు జోగులు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.