వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ! | Establishment of Sammakka Sarakka tribal university In Telangana | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ!

Dec 7 2023 5:20 AM | Updated on Dec 7 2023 5:20 AM

Establishment of Sammakka Sarakka tribal university In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం సుగమమైంది. సమ్మక్క –సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు, ఇతర ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచే వర్సిటీ అందుబా టులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే గిరిజన యూని వర్సిటీ ఏర్పాటును నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో పదేళ్లుగా జాప్యం అవుతూ వచ్చింది.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల క్రితమే భూ కేటాయింపులు పూర్తి చేసి గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేసింది. తాత్కాలిక అవస రాల కోసం భవనాలను కూడా కేటాయించింది. అనంతరం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి  (హెచ్‌సీయూ) అప్పగించారు. కానీ కేబినెట్‌ అనుమతులు, పార్ల మెంటులో బిల్లు ఆమోదం కాకపోవడంతో యూని వర్సిటీ కార్యకలాపాలు ముందుకు సాగలేదు.

హెచ్‌సీయూ పర్యవేక్షణ
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గెజిట్‌ జారీ కావడంతో కేంద్ర విద్యా శాఖ అధికారుల బృందం అతి త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతులు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత సంబంధిత అనుమతులన్నీ వేగంగా జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వర్సిటీని హెచ్‌సీయూ పర్యవేక్షించనుంది. ఇప్పటికే కోర్సులు, ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. అనుమతులు వచ్చిన వెంటనే 2023–24 విద్యా సంవత్సరంలో తరగతులు సైతం ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తోంది.

రూ.10 కోట్ల నిధులు..498 ఎకరాల భూమి
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2016–17 వార్షిక బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో 498 ఎకరాల భూమిని వర్సిటీ ఏర్పాటు కోసం గుర్తించి గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందులో 285 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 213 ఎకరాలు అటవీ శాఖకు చెందింది.

ఈ భూసేకరణ కోసం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపించింది. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సమీపంలో ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)ను కేటాయించింది. వర్సిటీ ఏర్పాటుపై హెచ్‌సీయూ లోతైన పరిశీలన జరిపి, డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను సమర్పించాలని ఆదేశించడంతో, ఆ మేరకు ప్రక్రియ పూర్తి చేసిన హెచ్‌సీయూ.. మూడేళ్ల క్రితమే కేంద్రానికి డీపీఆర్‌ సమర్పించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement