దూత మారాడు! | observer change in Adilabad Parliament constituency candidate selection | Sakshi
Sakshi News home page

దూత మారాడు!

Published Wed, Feb 5 2014 4:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

observer change in Adilabad Parliament constituency candidate selection

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రాహుల్‌గాంధీ దూత జిల్లాకు రాక విషయమై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ ఠాకూర్ ఈనెల మొదటి వారంలో జిల్లాకు వస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన జిల్లాకు వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం.

ఆయన స్థానంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు ఉమేష్‌రావు దేశ్‌ముఖ్‌ను నియమించినట్లు  సమాచారం. లాతూర్ జిల్లాలో ఎమ్మెల్యే అయిన ఉమేష్ రాహుల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే ఉమేష్ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అభిప్రాయ సేకరణ తంతు ముగించాల్సి ఉండగా, ఇంకా ఆలస్యమవుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

పెద్దపల్లి ఎంపీ స్థానం అభ్యర్థి ఎంపిక విషయమై అభిప్రాయ సేకరణ తంతు ముగిసింది. గ్రూపు రాజకీయాలు పరిపాటైన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ దూత పర్యటన సందర్భంగా మరోమారు బలప్రదర్శనకు దిగేందుకు ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ స్థానం ఎస్టీకి రిజర్వు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement