వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన
Published Fri, Oct 4 2013 3:04 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
ఒంగోలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు సంబంధించిన టీ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ సీపీ భగ్గుమంది. కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన అనంతరం ఒంగోలులో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాయరుపేటలోని ప్రకాశం పంతులు సాక్షిగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీమాంధ్రలోని ప్రజాభిప్రాయాన్ని యూపీఏ ఫ్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోని ఈ ప్రభుత్వానికి మనుగడ సాగించే అర్హతలేదన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన సీమాంధ్ర మంత్రులు, ఇతర నేతలకు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నిరుద్యోగులు పెరిగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకుల కుట్రలు బహిర్గతమయ్యాయని, వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజానీకం సమాయత్తం కావాలని కోరారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, వివిధ విభాగాల నాయకులు రొండా అంజిరెడ్డి, నెరుసుల రాము, యరజర్ల రమేశ్, బొప్పరాజు కొండలు, సింగరాజు రాంబాబు, వల్లెపు మురళి, తోటపల్లి సోమశేఖర్, పాకనాటి హనుమారెడ్డి, గోవర్థన్ పాల్గొన్నారు.
Advertisement