
ఇదేమి న్యాయం..!
గాలివీడు: మాకు సెంటు భూమి కూడా లేదు.. ఐదెకరాలు ఉందని పింఛన్ రద్దు చేశారు.. ఇదేమి న్యాయం.. అధికారులు అక్రమాలకు పాల్పడి మా పింఛన్‌లను తీసివేశారు. అంటూ పింఛనర్లు శనివారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ఎంపీడీఓను కార్యాలయంలోనే నిర్బంధించి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పినా వినిపించు కోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపీడీఓ కార్యాలయానికి వేసిన తాళం తీయలేదు.
ఎంపీడీఓ మినహా మిగిలిన అధికారులు కార్యాలయం బయటనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లడం కోసం వేచి ఉన్నారు. వీరు వ్యాన్లు, సుమోలలో వెళుతుండగా వారి వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి 10లోగా సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.