300-ఓసీఎస్..ఇప్పుడు ఇదే వైద్య ఆరోగ్యశాఖను కుదిపేస్తోంది. మూడు నాలుగేళ్ల రికార్డుల్లో తలదూర్చే పని కల్పిస్తోంది. ఎక్కడ ఏ లోపం ఉందో.. ఏ లెక్క తమ కొంప ముంచుతుందోనన్న ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఈ 300-ఓసీఎస్ ఏమిటంటే.. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బంది, వైద్యులకు సంబంధించిన వేతన బడ్జెట్ ఖాతా పేరే 300-ఓసీఎస్(అదర్ కాంట్రాక్చువల్ సర్వీస్). మరి దీని పేరెత్తితే ఉలికిపాటు ఎందుకంటే.. ఇటీవల విశాఖ జిల్లాలో ఈ ఖాతాలోని నిధుల వినియోగంలో కుంభకోణం బయటపడింది. దాంతో ఈ ఖాతా కింద గత మూడేళ్లలో జరిగిన నిధుల ఖర్చు వివరాలు పంపాలని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి అన్ని జిల్లాలకు తాఖీదులు అందడంతో ఆ లెక్కలతో ఇప్పుడు ఆ శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. రిమ్స్ క్యాంపస్ :
300 ఓసీఎస్ ఖాతా నిధుల వినియోగంలో జిల్లాలోనూ అధికారుల చేతివాటం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాల కోసం అడిగినప్పుడు అధికారుల తడబాటు ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది. జిల్లాలో 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటలో 29 మంది వైద్యులు, 186 మంది నర్సులు, 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 13 మంది ఫార్మశిస్టులు.. వీరితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో 115 మంది ఎంపీహెచ్‌డబ్ల్యు సిబ్బంది కాంట్రాక్టు, థర్డ్ పార్టీ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరందరికి మూడు నెలలకోసారి 300-ఓసీఎస్ ఖాతా కింద వేతన బడ్జెట్ విడుదలవుతుంది. నెలకు సుమారు *51 లక్షలు చొప్పున మూడు నెలలకు *1.53 కోట్లు విడుదలవుతాయి. అంటే ఏడాదికి సుమారు *6.12 కోట్లు. ఉద్యోగుల హాజరు, పనిదినాలను బట్టి ఇందులో కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అయితే ఈ ఖాతా ద్వారా విడుదలవుతున్న నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా అన్నదానిపై ఇంత వరకు స్పష్టత లేదు. కొందరు వైద్యాధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు ఈ నిధుల వినియోగంలో చేతి వాటం చూపినట్టు సమాచారం. విశాఖపట్నంలో కూడా ఈ విధంగానే పని చేయకుండానే కొన్ని దొంగ పేర్లు పెట్టి నిధులు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల వివరాలు పంపాలని ఆరోగ్య శాఖ డెరైక్టర్ ఆదేశించారు.
జిల్లా వివరాలు పంపడంలో ఆలస్యం
2011 నుంచి 2014 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు చెందిన ఖర్చుల వివరాలు పంపాలని తాఖీదులు అందడంతో జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీహెచ్‌సీల వారీగా ఏ ఏడాది ఎంత బడ్జెట్ వచ్చింది. ఆ ఏడాది ఎంతమంది పని చేశారు. ఎన్ని నిధులు ఖర్చు చేశారన్న వివరాలు స్పష్టంగా పంపాలని ఆదేశించడంతో ఆ లెక్కల సేకరణలో అధికారులు తలమునకలుగా ఉన్నారు. ఎంత ఖచ్చితంగా ఉన్నా.. ఎక్కడో ఏవో చిన్న పొరపాట్లు జరగడం సహజమని, ఇప్పుడు ఆ వివరాలు వెలికితీస్తే విశాఖ అధికారుల మాదిరిగా తాము కూడా దొరికిపోతామేమోనన్న ఆందోళన జిల్లా అధికారులకు పట్టుకుంది. లెక్కలు తరచి తరచి చూస్తూ గడువు ముగిసినా కూడా వివరాలు పంపకుండా కాలక్షేపం చేస్తున్నారు. తప్పులు జరిగిన పీహెచ్‌సీల్లో వాటిని సరిదిద్దిన అనంతరం పక్కా వివరాలు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖలోనే సాగుతోంది. అందువల్లే ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీల వివరాలు సిద్ధం కాలేదని తెలిసింది. అధికారులనే వివరాలు కోరడం కంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
12 పీహెచ్‌సీల వివరాలు రావాలి
దీనిపై డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాలనాధికారి వీర్రాజు వద్ద ప్రస్తావించగా 300-ఏసీఎస్ బడ్జెట్ వినియోగానికి సంబంధించి వివరాలు కోరుతూ హెల్త్ డెరైక్టరేట్ నుంచి ఆదేశాలు అందడం వాస్తవమేనని ధ్రువీకరించారు. 12 పీహెచ్‌సీల నుంచి వివరాలు అందాల్సి ఉందని, అవి అందిన వెంటనే పంపిస్తామని చెప్పారు. ఈ నిధుల వినియోగం జిల్లాలో ఎక్కడా అవకతవకలు జరగలేదని చెప్పారు.
ఆరోగ్యశాఖకు ఓసీఎస్ జ్వరం!
Published Thu, Jan 22 2015 9:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement
Advertisement