సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది గుండె పగిలి చనిపోయారని, అలాంటి ఆత్మ బంధువుల కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలోనే మెతుకు సీమలో పర్యటిస్తానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. సోమవారం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
ఓదార్పు యాత్రతోపాటు జిల్లా రాజకీయాలపై చర్చిం చినట్టు జిల్లా నేతలు వెల్లడించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో దాదాపు 15 మంది మరణించారని, త్వరలోనే వారి కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి ఓదార్చనున్నట్టు, అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారని వారు చెప్పారు. వైఎస్సార్ సీపీ మొదటి నుంచి సమైక్యాన్ని కోరుకుంటుందని, సమైక్యం అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని, ఈ మూడు ప్రాంతాల్లోనూ తమ పార్టీ ఉంటుందని అన్నట్టు వారు పేర్కొన్నారు. విభజన జరిగినందున ఇక తెలంగాణలోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని సూచించారని వారు వెల్లడించారు. వైఎస్సార్‌ను అభిమానించే వారిపై ఓ సంస్థ సర్వే చేస్తే తెలంగాణలోనే అత్యధికంగా 63 శాతం మంది ఉన్నట్టు తేలిందని ఇదే విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తమకు వెల్లడించినట్టు చెప్పారు.
ప్రజాభిమానాన్ని ఎంత మేరకు ఓట్ల రూపంలోకి మలుచుకోగలమో నాయకుల కృషిపైనే ఆధారపడి ఉంటుందని అన్నట్టు తెలిపారు. సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఖాయమని, జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేలా అక్కడి పరిపాలన ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా పార్టీని పటిష్టమైన స్థితికి తీసుకొచ్చేలా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని జగన్ సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది కానీ సంక్షేమ పథకాలు, జలయజ్ఞం తదితర పథకాలను పూర్తిగా నీరుగార్చిందని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించినట్టు వారు చెప్పారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నట్టు వారు తెలిపారు.
ఇన్‌చార్జిల ఖరారు!
జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను త్వరలో నియమించనున్నారని వారు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా అప్పారావు షెట్కార్, సంగారెడ్డి నియోజకవర్గ సింగిల్ ఇన్‌చార్జిగా గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పేర్లు దాదాపు ఖరారైనట్టు వారు తెలిపారు. పార్టీ అధినేతతో సమావేశమైన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కొమ్మెర వెంకటరెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ ఉజ్వల్‌రెడ్డి, అప్పారావు షెట్కార్, మాణిక్ రావు, నర్రా భిక్షపతి, సతీష్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, రఘుపతిరావు ఉన్నారు.
ఆత్మబంధువులను కలుస్తా..
Published Mon, Feb 24 2014 11:33 PM | Last Updated on Mon, Aug 27 2018 9:16 PM
Advertisement