ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్తుల అరెస్టు | Offenders arrested three inter-district | Sakshi
Sakshi News home page

ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్తుల అరెస్టు

Published Thu, Oct 3 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

Offenders arrested three inter-district

కంకిపాడు, న్యూస్‌లైన్ : ఓ చోరీ కేసులో ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్తులను కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 230 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ షకీలాభాను స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన కుందేటి రాధాభాయ్ తన కుమార్తెతో కలిసి గత నెల 10న చెన్నై వెళ్లారు. 14న ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు, బంధువులు  చోరీ జరిగినట్లుగా గుర్తించారు.

ఈమేరకు బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలంలో లభించిన కీలక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. విశాఖపట్నం, కోదాడ, భీమవరం ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. విజయవాడ యూసీ టీ కార్నర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కేసు చిక్కుముడి వీడింది. విజయవాడ కేదారేశ్వర పేటకు చెందిన గుడిపాటి ఫణీంద్రబాబు సెల్ పౌచ్‌లు అమ్ముతూ జీవిస్తుంటాడు. వీటి అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ము జల్సాలకు చాలకపోవటంతో చోరీలకు పాల్పడటం అలవాటు చేసుకున్నాడు.

ఇప్పటివరకూ విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నేరాలకు పాల్పడ్డాడు. సుమారు 23కుపైగా కేసులు ఇతనిపై ఉన్నాయి. గుంటూరులో జరిగిన కేసు విషయంలో ఫణీంద్రబాబును గన్నవరం జైలుకు తరలించారు. అదే జైలుకు ఉప్పులూరులో ఓ బడ్డీ తగలపెట్టిన కేసులో ఆ గ్రామానికి చెందిన పగిడిపాల ప్రసాద్‌ను కూడా తరలించారు. జైలులో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఫణీంద్ర చేసిన  చోరీల్లో లభించిన వస్తువులను విక్రయించేందుకు విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం దిమ్మరాజు గ్రామానికి చెందిన మాటూరి లీలా ప్రసాద్ సహకరించేవాడు.

ఇటీవల విజయవాడలో ఫణీంద్ర, పగిడిపాల ప్రసాద్, మాటూరి లీలాప్రసాద్ కలుసుకున్నారు. ఉప్పులూరు గ్రామంలోని రాధాభాయ్ నివాసంలో చోరీకి పాల్పడాలని పథకం రచిం చారు.  గత నెల 13 రాత్రి ఫణీంద్ర, ప్రసాద్, లీలా ప్రసాద్ ముగ్గురూ కలిసి విజయవాడ మధురానగర్ నుంచి రైలులో ఉప్పులూరు వచ్చి రాధాభాయ్ నివాసంలో చోరీకి పాల్పడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీ సులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. జల్సాలకు, మత్తుపానీ యాలకు బానిసలు కావడం వల్లే సంపాదిం చే సొమ్ము చాలక వీరు చోరీలకు పాల్పడుతున్నారని ఏసీపీ చెప్పారు. ప్రసాద్ తాపీ పనిచేస్తుంటాడని, లీలాప్రసాద్ భీమవరంలో హోటల్ కార్మికుడని వివరించా రు. వీరు ముగ్గురూ కుటుంబాలకు దూరంగా ఉంటూ  చోరీలకు పాల్పడు తున్నారని వెల్లడించారు.

 సిబ్బందికి అభినందనలు

ఈస్ట్ జోన్ ఏసీపీ షకీలాభాను పర్యవేక్షణలో కేసును ఛేదించిన సిబ్బందిని విజయవాడ సీపీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.  గన్నవరం సీఐ రత్నరాజు, ఎస్‌ఐ షేక్ మెహబూబ్ షరీఫ్, కంకిపాడు ఎస్‌ఐ గుణరాము, పెనమలూరు ఎస్‌ఐ సుధాకర్, కానిస్టేబుళ్లు రవి, ప్రసాద్, అనిల్, గౌరి, సురేష్‌కు సీపీ రివార్డులు ప్రకటించారు.

Advertisement
Advertisement