- కాచి చల్లార్చిన నీటి వినియోగం తప్పనిసరి
- ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ లీలా ప్రసాద్
పాడేరు : ఏజెన్సీలోని గిరిజనులంతా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ లీలా ప్రసాద్ కోరారు. ఇటీవల అనారోగ్య మరణాలు నమోదైన లింగాపుట్టు గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలోని 32 మంది గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరాలుగా నిర్ధారించి మందులు పంపిణీ చేశారు. ఏడీఎంహెచ్‌ఓ లీలా ప్రసాద్‌తో పాడేరు క్లష్టర్ ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ విశ్వేశ్వరనాయుడు కూడా ఇంటింటా తిరిగి గిరిజనుల ఆరోగ్యంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లీలాప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా సకాలంలో వైద్యసేవలు పొందాలన్నారు. ఆశ కార్యకర్త వద్ద పుష్కలంగా మందులు ఉన్నాయన్నారు. నీటి కాలుష్యం కారణంతో డయేరియా, విషజ్వరాలు సోకుతాయని, అయితే గిరిజనులు తాము సేకరించిన నీటిని బాగా మరగబెట్టి చల్లారిన తరువాత సేవించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు.
గెడ్డలు, వాగులు, ఊటలు నుంచి సేకరించిన నీటిని నేరుగా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. వ్యాధులపై కూడా గిరిజనులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులకు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీహెచ్ కామేశ్వరి, పీహెచ్‌ఎన్ దేవి, హెల్త్ సూపర్‌వైజర్లు సుబ్రహ్మణ్యం, నాయుడు, ప్రకాష్ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.